సంక్షేమం, సమగ్ర అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, సమగ్ర అభివృద్ధి

Jun 3 2026 12:21 AM | Updated on Jun 3 2026 12:21 AM

● ‘సీతారామ’తో 1.57లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ● సీతమ్మసాగర్‌ కోసం 3,123 ఎకరాల భూసేకరణ పూర్తి ● తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దేశం దృష్టిలో తెలంగాణ కాల్వ పనులకు టెండర్లు విద్యార్థులకు అల్పాహారం

ఇదే ధ్యేయంగా అంతా దీక్ష బూనాలి
● ‘సీతారామ’తో 1.57లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ● సీతమ్మసాగర్‌ కోసం 3,123 ఎకరాల భూసేకరణ పూర్తి ● తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ క్రమాన దేశం దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక’ పేరిట ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్త్తోందని తెలిపారు. గ్రామ, వార్డు మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 2,07,391 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయగా, 63,614 మంది రైతులకు రూ.400కోట్లకు పైగా రుణమాఫీ చేశామని తెలిపారు. అలాగే, 1.05లక్షల మంది రైతులకు బీమా చేయగా, అందులో 1,924 మంది రైతు కుటుంబాలకు రూ.96.20కోట్ల పరిహారం అందిందని చెప్పారు. ఇక ఆయిల్‌ పామ్‌, కోకో సాగు విస్తీర్ణంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానాన నిలిచిందని తెలిపారు.

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడం, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దీక్ష బూనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో మంగళవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మంత్రి, ఆతర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్‌, విద్యాచందన, జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొనగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కింద జూలూరుపాడుకు చెందిన యెల్లంకి కళావతి, కేలోత్‌ బాలు(సాయిరాం తండా), బాదావత్‌ లలిత(గుండ్లరేవు), చిమట వెంకటనరసమ్మ(శంభునిగూడెం)కు మంత్రి మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే, 478 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ.51.06 కోట్ల చెక్కు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.59.53 లక్షల చెక్కులు అందజేశాక మంత్రి తుమ్మల మాట్లాడారు.

సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడు పంప్‌ హౌస్‌లను ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రధాన కాల్వ నుంచి ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా నీరు విడుదల చేయగా, ఉప ప్రధాన కాలువ పనులకు టెండర్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా జిల్లాలో 1,57,574 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు చిన్న నీటి తరహా చెరువుల కింద 42,935 ఎకరాల స్థిరీకరణకు ప్రతిపాదించామన్నారు. ఇక సీతమ్మ సాగర్‌ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌ కోసం 3,123 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని తెలిపారు. అలాగే, 21 చెక్‌డ్యాంలతో 7,275 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ 875 కోట్లతో 127 రహదారుల పనులు చేపట్టగా 48 పూర్తయ్యాయని చెప్పారు. కాగా, పాండురంగాపురం – సారపాక రైల్వే లైన్‌, కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు.

జిల్లాలోని 1,323 ప్రభుత్వ పాఠశాలలో 59,088 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇప్పటికే అందిస్తుండగా, ఈ విద్యాసంవత్సరంలో ఉదయం అల్పాహారం కూడా పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతేకాక జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమల్లోకి రానుందని చెప్పారు. ఐదు నియోజకవర్గాలకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేశామని, కొత్తగూడెంలో దేశంలోనే మొట్టమొదటి ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేశామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే 1.84లక్షల మందికి పైగా వినియోగదారులకు రూ.40.76 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మహాలక్ష్మి ద్వారా 5.36 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వీరబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement