ట్రాక్టర్‌, బొలెరో వాహనం ఢీ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌, బొలెరో వాహనం ఢీ

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 7:50 AM

13 మంది కూలీలకు గాయాలు

అశ్వారావుపేటరూరల్‌: బొలెరో వాహనం, ట్రాక్టర్‌ ఢీకొని 13 మంది కూలీలు గాయపడ్డ ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్త మామిళ్లవారిగూడెం, బోర్యాలగుట్ట, కోర్సగూడెం, ఊసిర్లగూడెం గ్రామాలకు చెందిన 17 మంది కూలీలు ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం కామయ్యపాలేనికి వర్జీనియా పొగాకు గ్రేడింగ్‌ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని బొలెరో వాహనంలో తిరిగి స్వగ్రామాలకు వస్తున్నారు. అదే సమయంలో గుమ్మడవల్లి వైపు నుంచి తాటి దుంగల లోడ్‌తో ట్రాక్టర్‌ వస్తోంది. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం వద్దనున్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో కె.సుజాత, కె.రాంబాబు, దుర్గమ్మ, నాగలక్ష్మి, పెద్ద వెంకటేష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పెద్ద వెంకటేష్‌, కె.రాంబాబు వ్యాన్‌ కేబిన్‌లో ఇరుక్కుపోగా స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఎం.పావని, ఎం.సుకన్య, సీహెచ్‌ కోటేష్‌, సీహెచ్‌.జగదాంబ, పి.భవాని, సీహెచ్‌ పుల్లయ్య, కె.రమణ, ఎం.శివలు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ఇంజన్‌ రెండు ముక్కలు కాగా, బొలెరో వాహనం ధ్వంసమైంది. ఎస్‌ఐ యయాతీ రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బొలెరో, లారీ ఢీకొని ముగ్గురికి..

పినపాక/మణుగూరుటౌన్‌: బొలెరో వాహనం, లారీ ఢీకొని ముగ్గురు మిర్చి కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, కూలీల కథనం ప్రకారం.. మణుగూరు మండలం సింగారం గ్రామానికి చెందిన కూలీలు మిర్చి ఏరేందుకు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో దుగినేపల్లి సమీపంలో రాజపేట నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కూలీలు ధరావత్‌ లక్ష్మి, మునిషా య మ్మ, జి. లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మణుగూరు, భద్రాచలం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. కాగా బాధితులను సర్పంచులు పూనెం రమేష్‌, జగిడి ప్రసాద్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, సీపీఐ నాయకుడు జంగం మోహన్‌రావు, కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్‌, శివసైదులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement