పారిశ్రామిక ప్రగతిలో కనిపించని దూకుడు సీతారామ ఫలాలు జిల్లాకు దక్కేది ఎప్పుడో.. విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించేనా ?
గతంతో పోల్చితే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడ్డాయి. మెడికల్ కాలేజీ రాకతో కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి ఔట్ పేషెంట్ విభాగంలో రద్దీ పెరిగింది. అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో ఈ రంగంలో కుదుపు వచ్చిపడింది. జిల్లాలో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 61 మంది వైద్యులు పని చేస్తుండగా ఇందులో 32 మంది వృత్తి పరమైన ఉన్నత విద్య కోసం తమ సేవల నుంచి వీడ్కోలు తీసుకోనున్నారు. సర్వజన ఆస్పత్రిలోనూ రెసిడెంట్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో దూరం కానున్నారు. వైద్య రంగం గాడిన పడుతోందనే నమ్మకం కలిగే దశలో ఈ అనూహ్య పరిణామం జిల్లా వాసులకు చేదు గుళికగానే పరిగణించవచ్చు. అయితే, వచ్చే వర్షాకాలం నాటికి ఖాళీలను భర్తీ చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు పట్టాలెక్కుతున్నాయి. ఇందులో తొలి విడతగా రూ.100 కోట్లతో ఈ నవమికి పనులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు మాఢ వీధుల విస్తరణకు స్థల సేకరణ కూడా చేపట్టింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలకే తలమానికమైన భద్రాచలం అభివృద్ధి పట్టాలెక్కనుండడం తీపి కబురనే చెప్పాలి. అలాగే భద్రాచలం – మల్కన్‌గిరి రైలుమార్గంలో పాండురంగాపురం – సారపాక సెక్షన్ మంజూరు కావడం శుభపరిణామం.
కొంగొత్త ఆశలతో శ్రీపరాభవ నామ సంవత్సరంలోకి అడుగులు పడుతున్నాయి. ఉగాది పండుగ అంటేనే షడ్రుచుల సమ్మేళనం. అభివృద్ధి, సంక్షేమం విషయంలో జిల్లా పురోగతి, ప్రజల ఆకాంక్షలను తెలియజేసేలా నూతన సంవత్సర కథనం.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి జిల్లా అంటేనే పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ పారిశ్రామిక ప్రగతి ఆగిపోయిన తీరు వంటలో ఉప్పు తక్కువైన పరిస్థితిని గుర్తుకు తెస్తోంది. జిల్లాలో అనేక భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంలో అవి విఫలమయ్యాయి. కేటీపీఎస్ విస్తరణ ప్రకటనల్లోనే ఉంది. కొత్త బొగ్గు గనులదీ అదే పరిస్థితి. ప్రైవేట్ రంగంలో ఐటీసీ – భద్రాచలం పీఎస్‌పీడీ విస్తరణకు బ్రేకులు పడ్డాయి. ఒక్క మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌లోనే విస్తరణ జరుగుతోంది. వచ్చే ఏడాదిలోనైనా ఈ లోటు భర్తీ చేస్తారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
ఊరించే లక్షణం పులుపు రుచికి ఉంటుంది. జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అనే అంశం రెండు దశాబ్ధాలుగా జిల్లా వాసులను ఊరిస్తూనే ఉంది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ మేరకు టెక్నికల్ టీమ్‌ను సైతం ఒకసారి రప్పించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులను అనుసరించి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం ఉంది. ఇక జిల్లాకు ఐదు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరైనా ఒక్కచోట కూడా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల పరిస్థితీ అంతే అన్నట్టుగా ఉంది. వచ్చే ఏడాదైనా ఈ కలలు సాకారం కావాలని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
మంట పుట్టించే గుణం కారానికి ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు వర ప్రదాయినిగా చెప్పుకుంటున్న సీతారామ ప్రాజెక్ట్ కోసం ఇక్కడి నీటిని తరలిస్తున్నారు. నిర్మాణం కోసం స్థానిక రైతులు భూములు కోల్పోయారు. అటవీ సంపదకూ నష్టం వాటిల్లింది. ఆఖరికి రెండేళ్ల కిందట మొదలెట్టిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు కూడా ఇంత వరకు పట్టాలెక్కలేదు. సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభించి పదేళ్లు పూర్తయినా ఒక ఎకరం కూడా కొత్త ఆయకట్టు రాకపోవడమనేది ఈ జిల్లా వాసుల కళ్లలో కారం కొట్టడమే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాకు ఉపకరించే రాజీవ్ సాగర్ కెనాల్‌పై చూపిన శ్రద్ధ డిస్ట్రిబ్యూటరీ పనుల్లో కనిపించడం లేదు. రాబోయే ఏడాదిలోనైనా ఈ పనులు చేపట్టడంతో పాటు ఇల్లెందు ప్రాంత రైతుల కోసం రోళ్లపాడు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల వారి కోసం కొత్తగా ఎత్తిపోతల పనులు ప్రారంభించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
పాత ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణకే తలమానికమైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ప్రారంభించారు. అయితే, ఫ్యాకల్టీ నియామకం, సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్లు పూర్తి స్థాయిలో జరగలేదు. చివరకు వైస్ చాన్స్‌లర్ కూడా లేరు. ఈ యూనివర్సిటీ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రణాళిక సిద్ధం చేశారు. కనీసం 2026 – 27 బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి, నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
పట్టాలెక్కుతున్న భద్రాచలం ఆలయ పనులు


