సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాలు పెంచేలా బ్యాంకర్లు దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడీఓసీలో బుధవారం నిర్వహించిన డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాల పంపిణీ తక్కువగా ఉన్న బ్యాంకు అధికారులను కారణమేంటని ఆరా తీశారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో రెన్యువల్ చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ 3.24 కోట్ల లక్ష్యానికి రూ 12.37 కోట్లు మంజూరు చేసి 381.79 శాతం సాధన నమోదు కావడం అభినందనీయమన్నారు. ఇతర విభాగాలలో రూ.152.35 కోట్ల లక్ష్యానికి రూ 62.82 కోట్లు మాత్రమే మంజూరు చేశారని అన్నారు. స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ, ఎన్‌పీఏల తగ్గింపు, పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, ముద్ర, విశ్వకర్మ తదితర రుణాలపై చర్చించారు. అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టాలి
జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా, సాగు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలకు ఆధునిక యంత్రాల ఏర్పాటుపై సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి సాగును గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలల్లో ప్రతీ బుధవారం మాదకద్రవ్యాలపై అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు. ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు కేసుల వివరాలను తమకు అందించాలని కోరారు. అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లా అయినందున మాదకద్రవ్యాల రవాణా అధికంగా ఉండే అవకాశం ఉందని, గత నెలలో సుమారు 6వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయా సమావేశాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, ఎల్‌బీఎం రామిరెడ్డి, మత్స్య శాఖాధికారి ఇంతియాజ్ ఖాన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్, ఆర్టీఓ వెంకటరమణ, డీఐ అశ్విని పాల్గొన్నారు.
విద్యార్థుల పఠనా సామర్థ్యంపై దృష్టి పెట్టాలి
టేకులపల్లి: విద్యార్థుల పఠనా సామర్థ్యంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అంకిత్ ఉపాధ్యాయులకు సూచించారు. టేకులపల్లి, కోయగూడెం పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, వారికి అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల భవనాల స్లాబ్ పెచ్చులు ఊడిపోవడం, ఆవరణలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టేకులపల్లిలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. కోయగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. కొందరు విద్యార్థులు చదువులో వెనుకబడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీఓ శ్రీరామ్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ బైరు మల్లేశ్వరి, వైద్యాధికారి వెంకటేశ్ తదితరులు ఉన్నారు.


