దక్కని మెజారిటీ | - | Sakshi
Sakshi News home page

దక్కని మెజారిటీ

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

దక్కని మెజారిటీ

దక్కని మెజారిటీ

● కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు నిరాశ ● మున్సిపల్‌ ఎన్నికలలో సమష్టిగా కదలని పార్టీ శ్రేణులు ● ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించిన నాయకులు

పెద్దదిక్కు ఏది

● కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు నిరాశ ● మున్సిపల్‌ ఎన్నికలలో సమష్టిగా కదలని పార్టీ శ్రేణులు ● ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించిన నాయకులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్‌ చేస్తామనే ధీమా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో కనిపించింది. కానీ, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి జిల్లాలో మిగిలిన ఏడు మున్సిపాలిటీల తరహాలో సింపుల్‌గా ముగిసిపోవాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్తా క్యాంపు రాజకీయాలు, హైదరాబాద్‌లో హై లెవల్‌ మీటింగ్‌ల వరకు చేరుకుంది. ఈ పరిస్థితికి కారణమేంటనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.

మేనిఫెస్టో కరువైంది

కాంగ్రెస్‌ పార్టీ తరఫున మేయర్‌ అభ్యర్థి ఎవరనేది స్పష్టతలేదు. దీంతో 60 డివిజన్లను సమన్వయం చేసేవారు కరువయ్యారు. అభ్యర్థులంతా ఎవరికి వారుగా తమ డివిజన్లలో ప్రచారానికే పరిమితమయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండి కూడా తొలిసారిగా జరుగుతున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తామనే కనీస మేనిఫెస్టో ప్రకటించడంలో కాంగ్రెస్‌ విఫలమైంది.

భారమంతా పొంగులేటిపైనే..

ఎన్నికల భారమంతా మాస్‌లీడర్‌గా పేరున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భుజాలపై పెట్టి ఇతర నాయకులు రిలాక్స్‌ అయ్యారనే ప్రచారం కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. మంత్రి పొంగులేటి కార్పొరేషన్‌లో పర్యటిస్తే తప్ప ప్రచారానికి ఊపు తెచ్చే విధంగా ఇతర నాయకులెవరూ ప్రయత్నించకపోవడం హస్తం పార్టీకి చేటు తెచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ఆఖరికి పోల్‌ మేనేజ్‌మెంట్‌ తాయిలాల పంపిణీ విషయంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎదుటి పార్టీ అభ్యర్థులతో పోల్చితే వెనుకబడి పోయారనే ప్రచారం సైతం కాంగ్రెస్‌కు నష్టం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ హోదా, మంత్రి పొంగులేటి అండ, చేయి గుర్తులు తమ గెలుపునకు చాలనే అభ్యర్థుల ధీమా చివరకు చేటు తెచ్చిందనే మాటలు కొత్తగూడెంలో వినిపిస్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు తమకు ప్రాధాన్యత దక్కలేదని, అలాంటప్పుడు ఈ ఫలితాలకు తమను ఎలా బాధ్యులను చేస్తారనే వాదనలు కొందరు కాంగ్రెస్‌ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

అహంకారానికి, ఆత్మగౌరవానికి

మధ్య పోటీ అంటూ..

నోటిఫికేషన్‌ రాక ముందు నుంచి 22 డివిజన్లలో విజ యం సాధిస్తామంటూ చెబుతూ వచ్చిన సీపీఐ చివరకు అన్నంత పని చేసింది. అహంకారానికి – ఆత్మగౌరవానికి మధ్య పోటీ అంటూ సెంటిమెంట్‌ను రంగరించి ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయింది. బూత్‌ లెవల్‌ కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా అంతా సమష్టిగా పని చేశారు. చివరకు అధికార కాంగ్రెస్‌ను మెజార్టీ ఫిగర్‌కు దూరంగా నిలిపారు.

2018 సాధారణ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు పార్టీని వీడినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వ సమస్య ఎదురవుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఇక్కడ కాంగ్రెస్‌ శ్రేణులు శక్తిని పుంజుకున్నాయి. అయితే, సర్దుబాటు కారణంగా ఆయన పాలేరుకు వెళ్లడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా నడిపించే నేత కరువయ్యాడు. డీసీసీ అధ్యక్షురాలు దేవీ ప్రసన్న మొదలు సీనియర్‌ నేతలు బాలసాని లక్ష్మీనారాయణ, కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళీకృష్ణ, మోతుకూరి ధర్మారావు, ఎడవల్లి కృష్ణ, నాగా సీతారాములు, జేబీ శౌరీ, ఊకంటి గోపాల్‌రావు, తుళ్లూరి బ్రహ్మయ్య, తూము చౌదరి తదితర సీనియర్‌ రాజకీయ నాయకులు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే పని చేసుకుంటూ వస్తున్నారు. సమస్య వస్తే ఎవరిని కలవాలి, ఏ పవర్‌ సెంటర్‌ను ఆశ్రయిస్తే పని జరుగుతుందనే విషయంలో పార్టీ కార్యకర్తలకు స్పష్టతలేకుండాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement