ఆటో.. జీవనం ఎటో..?
ఉచిత బస్సు సర్వీసులతో ఆదాయానికి గండి గిరాకీ లేక ఆటోడ్రైవర్ల ఇబ్బందులు భారంగా మారుతున్న కుటుంబ పోషణ
వృత్తికి దూరమయ్యా..
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
పాల్వంచరూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆటోడ్రైవర్లకు శాపంగా మారింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిండంతో ఆటోలకు ఆదరణ కరువైంది. మహిలంతా బస్సులను ఆశ్రయిస్తుండటంతో వీరి ఉపాధికి గండి పడుతోంది. రోజురోజుకూ గిరాకీ లేక, ప్రయాణికులు ఆటోలు ఎక్కక డ్రైవర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇక లోన్‌లో ఆటోలు కొనుకున్నవారికై తే వాటి కిస్తీలు కట్టడం కూడా కష్టంగా మారుతోంది. కుటుంబ పోషణ సైతం భారంగా మారడంతో ఈ వృత్తిని వదిలేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మార్కెట్, బజారు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మహిళలు ఆటోలను ఆశ్రయించేవారు. ఉచిత బస్సు సర్వీసులు నడపడంతో మహిళలు ఆటోలవైపు కూడా చూడడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.
ప్రయాణికులు ఎక్కితేనే ఆదాయం..
ప్రయాణికులు ఆటోలు ఎక్కితేనే ఆటోడ్రైవర్లకు అంతో ఇంతో ఆదాయం లభిస్తుంది. లేదంటే ఖాళీ జేబులతో ఇంటి దారిపట్టడమే. ఆటో ద్వారా వచ్చే ఆదాయమే ఆటోల ఫైనాన్స్, చిట్టీలు, ఇతర ఇంటి ఖర్చులకు ఆధారం. ఆర్టీసీ బస్సులు నడవని మార్గాల్లో ప్రయాణికులు, స్కూల్ పిల్లలను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఎంతో కొంత ఆదాయాన్ని గడిస్తున్నారు. అయితే, ఇలా కొందరికే అవకాశం వస్తోంది. కానీ, చాలావరకు ఆటోలకు ప్రయాణికులు దొరకడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటోలను నడపగా వచ్చిన ఆదాయంలో డీజిల్ ఖర్చు పోనూ ఏమాత్రం మిగలడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హామీలు అమలు చేయాలి..
అధికారంలోకి రాగానే క్యాబ్, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామని, కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలను నెరవేర్చాలని ఆటోడ్రైవర్లు కోరుతున్నారు. జిల్లాలో 20 నుంచి 25 వేలకుపైగా ఆటోలు నడుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు డ్రైవర్లు వృత్తిని వదిలేసి ఇతర పనులు చేసుకుంటున్నారు.
ఆటోలకు ఆదరణ కరువు..
మూడు, నాలుగేళ్ల క్రితం వరకు అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.600 రూ.700 మిగిలేవి. ప్రస్తుతం ఆటోలకు గిరాకీ లేక డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. ఫలితంగా కుటుంబ పోషణ భారమై ఆటోడ్రైవర్ వృత్తిని వదులుకుని ఇతర పనులకు వెళ్తున్నాను. అప్పడప్పుడూ మాత్రమే ఆటో నడుపుతున్నాను.
–ఇబ్రహీం, కిన్నెరసాని
మహిళలకు ఉచిత బస్సు పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లు, వాటిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించాలి. 50 ఏళ్లు నిండిన ప్రతి ఆటోడ్రైవర్‌కు వృద్ధాప్య పింఛన్ మంజురు చేయాలి. ఆటో రవాణా రంగ కార్మికలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. –మోహన్, ఆటోడ్రైవర్
ఆటో.. జీవనం ఎటో..?
ఆటో.. జీవనం ఎటో..?


