పూరిల్లు దగ్ధం
ములకలపల్లి: షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని మూకమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వేముల శివ.. కుటుంబీకులతో కలిసి సత్తుపల్లి శివారులో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించేలోగానే ఇల్లంతా అగ్నికి ఆహుతైంది. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం ఇంటికి చేరుకుని, కన్నీటి పర్యంతమయ్యారు. సర్వస్వం కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
దాడి ఘటనపై కేసు
బూర్గంపాడు: మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బిజ్జం వెంకటేశ్వరరెడ్డిపై శుక్రవారం రాత్రి సారపాకకు చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఈ దాడి జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు.


