ఆశ్రమాల్లో ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమాల్లో ఫలితాలు

Jan 13 2026 6:00 AM | Updated on Jan 13 2026 6:00 AM

ఆశ్రమాల్లో ఫలితాలు

ఆశ్రమాల్లో ఫలితాలు

అధికారులు హెచ్చరిస్తున్నా అంతే..

ఈ ఏడాదైనా వంద శాతం ఉత్తీర్ణత సాధించేనా ? పది, ఇంటర్‌ విద్యార్థులపై ఐటీడీఏ అధికారుల దృష్టి వెనకబడిన విద్యాసంస్థల బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిక ముందుగానే మేల్కొనాలంటున్న తల్లిదండ్రులు

అందని ద్రాక్షే

భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో వంద శాతం ఫలితాల సాధన అందని ద్రాక్షగానే మారుతోంది. ప్రతీ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెల్లడయ్యాక విశ్లేషించడం కంటే.. వెనుకబడిన విద్యార్థులపై పరీక్షలకు ముందే ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ఐటీడీఏ పీఓ రాహుల్‌ సైతం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

గతేడాది నిరాశే..

గత విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మీడియట్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌లో 80.54, ఒకేషనల్‌లో 94.92 శాతం.. మొత్తంగా 81.73 శాతం, ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 85.63, ఒకేషనల్‌ 88.80 శాతం మొత్తంగా 85.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలోనూ 93.50 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పీఓ రాహుల్‌ చేపట్టిన ఉద్దీపనం, వంద రోజుల ప్రణాళికలతో కొంతమేర ఫలితాలు మెరుగైనా నూరు శాతం మాత్రం సాధించలేకపోయారు. కొన్ని పాఠశాలల్లో మరీ అత్యల్పంగా ఫలితాలు వచ్చాయి. ఐటీడీఏ పరిధిలో 14 గురుకుల కళాశాలలు ఉండగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తిరుమలాయపాలెం గురుకులంలో 56 శాతం, కేఎస్‌డీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 63.37, కృష్ణసాగర్‌లో 66.33, గుండాలలో 69.16 శాతం ఫలితాలు మాత్రమే నమోదయ్యాయి. ఇక ద్వితీయ సంవత్సరంలో కేఎస్‌డీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 65.69, కృష్ణసాగర్‌ గురుకులం 70.21, గుండాల 72.55 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత సాధించాయి. కాగా పదో తరగతి ఫలితాల్లో తిరుమలాయపాలెం గురుకులంలో 79.7, కొత్తగూడెం గురుకులంలో 89 శాతం మాత్రమే ఫలితాలు రావడం గమనార్హం.

ప్రత్యేక శ్రద్ధతోనే ‘ఫలితం’..

ప్రాథమిక దశలోనే విద్యార్థులు చదువులో వెనుకబడుతుండడం వల్లే ఫలితాలు తగ్గుతున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. ప్రాథమిక దశలో గణితం, ఇంగ్లిష్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు లోపించడంతో ఉన్నత విద్యలో పెరిగే సిలబస్‌ వారికి భారంగా మారుతోందని చెబుతున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, కనీసం ఏడో తరగతి నుంచైనా ప్రక్షాళన చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వంద శాతం ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పదో తరగతి, ఇంటర్‌లో తక్కువ ఫలితాలు నమోదైన కళాశాలలు, పాఠశాలల బాధ్యులపై ఐటీడీఏ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నా, షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నా మార్పు కనిపించకపోవడం గమనార్హం. గతేడాది ఇంటర్‌లో తక్కువ ఫలితాలు వచ్చిన కృష్ణసాగర్‌, కిన్నెరసాని గురుకులాలు, పదో తరగతిలో తక్కువ ఫలితాలు నమోదైన ఎల్చిరెడ్డిపల్లి, ఆర్లగూడెం, కరకగూడెం, ఉంజుపల్లి, కమలాపురం, రేగళ్ల తండా, సర్వారం, బొజ్జాయిగూడెం, కోయగూడెం ఆశ్రమ పాఠశాలల బాధ్యులకు, సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంద శాతం ఫలితాలే విద్యార్ధుల మేథాశక్తికి ప్రామాణికం కాదని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement