ప్రతీ దరఖాస్తును నమోదు చేయాలి
గిరిజన దర్బార్‌లో ఏపీఓ జనరల్
భద్రాచలం : గిరిజన దర్బార్‌లో అందే ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి రిజిస్టర్‌లో పొందుపర్చాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరములో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత యూనిట్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ మధుకర్, ఏఓ సున్నం రాంబాబు, అధికారులు లక్ష్మీనారాయణ, హరికృష్ణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
విష వాయువుల కట్టడి
ఇల్లెందురూరల్: మండలంలోని తిలక్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కుమ్మరిబస్తీ సమీపంలో భూగర్భం నుంచి వెలువడుతున్న విష వాయువులను సింగరేణి అధికారులు సోమవారం కట్టడి చేశారు. గ్రామ శివారులో మూతపడిన 20 పిట్ భూగర్భ గని సొరంగం కుంగిపోయిన ప్రదేశాన్ని ఏరియా జీఎం కృష్ణయ్య పరిశీలించారు. అందులో నుంచి వెలువడుతున్న విషవాయువుల ప్రభావంతో ఎలాంటి ఉపద్రవం సంభవించకుండా పొక్లెయినర్లతో సొరంగ మార్గాన్ని మట్టితో పూడ్చివేయించారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులతో పాటు తిలక్‌నగర్ సర్పంచ్ ధనసరి స్రవంతి పాల్గొన్నారు.
ప్రపంచానికే ఆదర్శం స్వామి వివేకానంద
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి) : విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం అహర్నిశలూ శ్రమించిన స్వామి వివేకానందుడు ప్రపంచానికే ఆదర్శప్రాయుడని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించగా డీఈఓ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంకమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పతంగుల ఉత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు వీరబాబు, తహసీల్దార్ గంటా ప్రతాప్. ఎంపీడీఓ మహాలక్ష్మి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.


