ఇక రిజర్వేషన్లపై కసరత్తు
● మున్సిపాలిటీల్లో తుది ఓటరు జాబితా విడుదల ● అభ్యంతరాల తర్వాత డ్రాఫ్ట్ కంటే తగ్గిన ఓట్లు ● పురపోరులోనూ గెలుపోటములను ప్రభావితం చేసేది మహిళలే
కొత్తగూడెంఅర్బన్ : మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో ఓటర్లకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఈనెల 1న అధికారులు విడుదల చేసిన అధికారులు.. అభ్యంతరాలను స్వీకరించి, వాటిని సరి చేసిన అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోని తుది జాబితాలను సోమవారం వెల్లడించారు. అభ్యంతరాలను సరి చేయడంతో ఓటర్ల సంఖ్య కొంతమేర తగ్గింది. అయితే తుది జాబితాలో కూడా తప్పులున్నాయని ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు అంటున్నారు. వీటిపైనా అభ్యంతరాలు స్వీకరించి సరి చేయాలని కోరుతున్నారు. ఎట్టకేలకు ఓటర్ల తుది జాబితా విడుదల కావడంతో అధికారులు, సిబ్బంది ఇక రిజర్వేషన్లు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.
ఆశావహుల సమాలోచనలు..
డివిజన్లు, వార్డులు, చైర్మన్, మేయర్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి బరిలో నిలవాలని ఆశావహులు సమాలోచనలు చేస్తున్నారు. తమకు అనుకూలమైన రిజర్వేషన్ రాకుంటే ఎవరిని బరిలో నిలపాలనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం కొత్తగూడెం మేయర్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ కౌన్సిలర్లు సైతం ఈసారి మేయర్ సీటుపై ఆశలు పెంచుకుంటున్నారు.
మహిళా ఓటర్లే అధికం..
కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో అభ్యంతరాల స్వీకరణ అనంతరం అధికారులు తుది జాబితాను సోమవారం విడుదల చేశారు. దీని ప్రకారం కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా వీటి పరిధిలో మహిళా ఓటర్లు 70,314 ఉంటే, పురుషులు 64,431 మాత్రమే ఉన్నారు. ఇతరులు 30 మందితో కలిపి మొత్తం 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డుల పరిధిలో 33,732 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 17,497, పురుషులు 16,222, ఇతరులు నలుగురు ఉన్నారు. నూతనంగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను మహిళా ఓటర్లు 8,761, పురుషులు ఓటర్లు 8,085, ఇతరులు నలుగురు కలిపి మొత్తం 16,850 మంది ఓటర్లున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేటలో కలిపి మహిళా ఓటర్లు 96,572 మంది ఉన్నారు. మున్సిపల్ పోరుకు సంబంధించి మహిళా ఓటర్లు దాదాపు లక్షకు చేరువలో ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములను వారే ప్రభావితం చేసే అవకాశం ఉంది.


