కాంగ్రెస్‌లో మహిళలకు పెద్దపీట
అశ్వారావుపేటలో నేడు పర్యటన
మంత్రి పొంగులేటి వెల్లడి
ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచరూరల్ : మహిళా సాధికరతే లక్ష్యంగా, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, కాంగ్రెస్ పార్టీలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవీప్రసన్న సోమవారం మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ సమక్షాన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ దేవీప్రసన్న నియామకం కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు మరింత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని, పార్టీ బలోపేతం ద్వారా రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిగా చేయడమే అందరి లక్ష్యం కావాలని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు తాను ఒకే ఆలోచనతో ఉన్నామని, పార్టీ పటిష్టతతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యమని అన్నారు. అనంతరం కొత్తగూడెం, పాల్వంచలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను పరిశీలించి మాట్లాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు మంజూరు చేస్తోందని చెప్పారు. సంక్రాంతి పండుగ సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు అద్దం పడుతున్నాయని అభినందించారు. అనంతరం రెండు చోట్లా వేర్వేరుగా విజేతలకు బహుమతులు అందజేశారు. కొత్తగూడెంలో మొదటి ఐదు బహుమతులు సాధించిన మహిళలకు రూ.30 వేల నుంచి రూ.10 వేల వరకు, కన్సొలేషన్ బహుమతులు రూ.5వేల చొప్పున అందజేశారు. పాల్వంచలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎం.శ్వేతకు రూ.30 వేల నగదు బహుమతి అందించారు. ఆయా కార్యక్రమాల్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.సుజాత, పాల్వంచ తహసీల్దార్ దారా ప్రసాద్, నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, కోనేరు చిన్ని, ఉకంటి గోపాల్‌రావు, తుళ్లూరి బ్రహ్మయ్య, చీకటి కార్తీక్, గడ్డం రాజశేఖర్, కంచర్ల చంద్రశేఖర్‌రావు, అల్లాడి నర్సింహారావు, ఆళ్ల మురళి, జె.వి.ఎస్.చౌదరి, సోమిరెడ్డి, నూకల రంగారావు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, కొండం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దొంతికుంట చెరువు ఆధునికీకరణ, మున్సిపాలిటీ భవనం, రైతు బజార్, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాలతో పాటు గుర్రాల చెరువులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను సన్మానిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను పరిశీలించనున్నారు.
కాంగ్రెస్‌లో మహిళలకు పెద్దపీట


