
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
15న జిల్లాస్థాయి
సైన్స్ డ్రామా
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 15న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ బి.నాగలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో 8 నుంచి 10వ తరగతి లోపు చదివే పిల్లలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మాన్ కై ండ్’ ప్రధానాంశంగా, విమన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా, ఎంపవరింగ్ లైఫ్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్ ఉపాంశాలుగా తీసుకోవాలని సూచించారు. డ్రామా నిడివి 30 నిమిషాలకు మించొద్దని, ఎనిమిది మంది మాత్రమే స్టేజిపై ప్రదర్శన ఇవ్వాలని, స్కిరప్ట్ రైటర్, డైరెక్టర్ హాజరు కావొచ్చని వివరించారు. డ్రామా ఏ భాషలోనైనా ఉండవచ్చని తెలిపారు. డ్రామాలో పాల్గొనేవారి వివరాలను ఈ నెల 14వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్ 98492 29350 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. పోటీలు పాత కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ఆనందఖని)లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఖమ్మంలో వేంకటేశ్వర స్వామి ఆలయం
● రేపు స్థలాలు పరిశీలించనున్న
టీటీడీ బృందం
ఖమ్మంఅర్బన్: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతితో టీటీడీ సానుకూలంగా స్పందించగా కొద్దిరోజుల క్రితం ఓ బృందం ఇక్కడ సానుకూలతలను పరిశీలించింది. ఆ తర్వాత 15వ డివిజన్ అల్లీపురం పరిధి హైదరాబాద్–దేవరపల్లి హైవే వెంట ధంసలాపురంలో సర్వే నంబర్లు 565, 563, 564, 565లో సుమారు 20 ఎకరాల భూమి అనుకూలంగా ఉందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అంతేకాక అదే గ్రామంలో సర్వే నంబర్ 408లో మరో 20 ఎకరాల భూమి కూడా ఉందని తెలిపారు. ఈ స్థలాలతో పాటు రఘునాథపాలెం బైపాస్‌లో నరిసింహులు గుట్ట భూమిని సైతం సోమవారం టీటీడీ బృందం పరిశీలించనుంది. ఆ తర్వాత స్థలాన్ని ఖరారు చేసి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామి వారి విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం గావించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేయగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన