
గంజాయి స్వాధీనం
అశ్వారావుపేట: అశ్వారావుపేట మీదుగా అక్రమంగా తరలిస్తున్న రూ.1.1 కోట్ల విలువైన 222 కిలోల (111 ప్యాకెట్లు) ఎండు గంజాయిని అశ్వారావుపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ పింగళి నాగరాజురెడ్డి వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం ఎస్‌ఐ రామమూర్తి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, జంగారెడ్డిగూడెం రోడ్‌లో పేపర్ మిల్లు సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. జంగారెడ్డిగూడెం వైపు నుంచి వస్తున్న పీ09బీవీ 5868 నంబరు గల కారును తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి విచారించారు. హైదరాబాద్‌కు చెందిన ఉంగరాల సరిన్‌కుమార్, బెల్లంపల్లికి చెందిన బాబర్‌ఖాన్ విశాఖపట్టణానికి చెందిన పంగి శ్రీను వద్ద రూ.4 లక్షలకు కొనుగోలు చేసిన 222 కిలోల ఎండు గంజాయిని మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌కు అధిక ధరకు అమ్మేందుకు అశ్వారావుపేట మీదుగా తరలిస్తున్నట్లు అంగీకరించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ ఎక్కువగా ఉందని భావించి సరిన్‌కుమార్ స్నేహితులైన హైదరాబాద్‌కు చెందిన ఎండీ ఫిరోజ్, సంతోష్ పైలట్‌గా ఓ ఇన్నోవా వాహనం వినియోగించారు. ప్రధాన నిందితుడు సరిన్‌పై గతంలో కూడా ఎన్‌డీపీఎస్ కేసులున్నట్లు సీఐ వెల్లడించారు. గంజాయి తరలించడానికి వినియోగించిన కారు, రెండు సెల్‌ఫోన్‌లు, జియో రూటర్, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ నాగరాజురెడ్డి వివరించారు. తనిఖీల్లో కొత్తగూడెం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, కానిస్టేబుళ్లు సంతోష్, రమేశ్, హరిబాబు పాల్గొన్నారు.