
విజ్ఞప్తులతో విసిగిపోయి.. తలా ఓ చేయి వేసి..
ఏడాది కాలంగా గుంతలమయంగా మారిన ముర్రేడు వంతెన
పట్టించుకోని ఎన్‌హెచ్, స్పందించని మున్సిపల్ కార్పొరేషన్
వంతెనపై గుంతలను సొంత ఖర్చులతో పూడ్చిన యువకులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: విజయవాడ–జగ్‌దల్‌పూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–30)లో కొత్తగూడెం నగరంలో ముర్రేడువాగుపై ఉన్న పాత బ్రిడ్జి మొత్తం గుంతలమయంగా మారింది. ఏడాదిన్నరగా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు నరకం చూస్తున్నారు. రాజకీయ పక్షాలు విజ్ఞప్తులు చేసినా, మీడియాలో పలుమార్లు కథనాలు వచ్చినా సమస్యకు పరిష్కారం లభించలేదు. ఆఖరికి ఆగస్టులో ఐడీఓసీలో ముగ్గురు మంత్రుల సమక్షంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి సమావేశంలోనూ ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. జాతీయ రహదారుల శాఖ తన పని చేయకపోయినా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్ శాఖల అధికారులైనా తాత్కాలిక మరమ్మతులు చేయాలని సూచించారు. రెండు నెలలు గడిచినా ఆ పని జరగలేదు. శనివారం కూడా ఓ వాహనదారుడు నిరసన తెలిపాడు. ప్రభుత్వ శాఖలకు మొరపెట్టుకోవడం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయింది. ఆటోలు, టూ వీలర్లు పాడైపోతున్నాయి. దీంతో నగరంలోని లోతువాగు ప్రాంతానికి చెందిన యాకుబ్‌పాషా, బొమ్మగాని శ్రీకాంత్, పాషా, బన్నీ, సూర్య, శ్రీధర్, నితిన్, మనోజ్ తదితరులు సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. సొంత ఖర్చులతో కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసి ఆటోలో తీసుకొచ్చి వంతెనపై గుంతలు ఉన్నచోట వేశారు. చిన్న నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదం జరగకుండా తమవంతు బాధ్యతను నెరవేర్చారు. దాదాపు ఏడాది పాటు నగర ప్రజలను, ఈ మార్గం గుండా ప్రయాణించే వారిని పీడిస్తున్న సమస్య పరిష్కారానికి పాటుపడ్డారు. వీరు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుల కృషిని పలువురు అభినందిస్తున్నారు.

విజ్ఞప్తులతో విసిగిపోయి.. తలా ఓ చేయి వేసి..