
నూరుశాతమే లక్ష్యం
● పదో తరగతిలో ఫలితాల మెరుగుకు విద్యాశాఖ అధికారుల దృష్టి ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● అభ్యాస దీపికలతో సన్నద్ధత, వారానికోసారి పరీక్షలు
కరకగూడెం: పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ దృష్టిసారించింది. పరీక్షలకు కొద్ది నెలల ముందు నిర్వహించే ప్రత్యేక తరగతులను ఈసారి ముందస్తుగానే, ఇటీవల ప్రారంభించింది. కష్టమైన అంశాలపై శ్రద్ధ చూపేలా అభ్యాస దీపికలను (వర్క్ బుక్స్) ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. జిలాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు 110 ఉండగా 4,650 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. 14 కేజీబీవీ పాఠశాలల్లో కూడా 567 మంది 10వ తరగతి చదువుతున్నారు. ఈసారి పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సిలబస్ పూర్తి చేయడంతపాటు ప్రతీ విద్యార్థికి సబ్జెక్ట్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు బోధన చేపడుతున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించడమే ప్రత్యేక తరగతుల ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, జిల్లా పదో తరగతి వార్షిక పరీక్షల్లో 2023–24 విద్యా సంవత్సరంలో 92.24 శాతం, 2024–25లో 92.14 శాతం ఫలితాలు సాధించింది.
పక్కాగా ప్రత్యేక తరగతులు
ప్రణాళిక ప్రకారం రోజూ పాఠశాల వేళలకు ముందు/ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు వ్యక్తిగత దృష్టి సారించి, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. వారానికోసారి పరీక్ష నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్‌లో వెనుకబడ్డాడో గుర్తించి, మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ప్రతీ సబ్జెక్ట్‌కు సంబంధించిన అభ్యాస దీపికలను పంపిణీ చేశారు. దీపికలోని ప్రశ్నలు, అభ్యాసాలను పూర్తి చేయించడం ద్వారా విద్యార్థులు సొంతంగా నేర్చుకునే నైపుణ్యాన్ని పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. గత పరీక్షల్లో తరచుగా అడిగిన ప్రశ్నలను, కష్టమైన యూనిట్లను పొందుపరిచి, చదివించడంతో విద్యార్థుల్లో పరీక్షలంటే భయం తగ్గనుంది. విద్యార్థులకు చదువుపై ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. టీచర్లు, అధికారులు కలిసి ఈ ఏడాది పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పాటుపడుతున్నారు.