
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై దరఖాస్తులను అందజేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సకాలంలో దర్బార్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన