
ఆద్యంతం ఉత్కంఠే..
ఉద్రిక్తత నడుమ పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణస్వీకారం
● కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు ● పోలీస్ పహారా నడుమ కార్యక్రమం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం ఆద్యంతం ఉత్కంఠ నడుమే కొనసాగింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ బందోబస్తు మధ్య పూర్తయింది. అమ్మవారి సాక్షిగా ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, ఓ మహిళ గాజులు పగులగొట్టుకోవడంతో పాటు మెడ కోసుకుంటానని ఆందోళనకు దిగింది.
అసలేం జరిగింది..
పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలి సభ్యులుగా 14 మంది పేర్లతో కూడిన జాబితా గతనెల 6వ తేదీన విడుదల కాగా, దీనిపై వివాదం తలెత్తింది. దేవాదాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ జీఓను రద్దు చేసి 19వ తేదీన 13 మంది సభ్యులతో మరో జాబితా వెల్లడించారు. ఈ కమిటీని ప్రమాణస్వీకారానికి ఈఓ రజినీకుమారి ఆహ్వానించగా.. స్థానికులకు అవకాశం కల్పించాలంటూ కేశవాపురం గ్రామస్తులు అందోళన చేయడంతో వాయిదా పడింది. రెండో జీఓ వెలువడి నెల రోజులు దాటడంతో తిరిగి మంగళవారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయగా.. మళ్లీ ఘర్షణ జరుగుతుందనే ఉద్దేశంతో డీఎస్పీ సతీశ్‌కుమార్, సీఐ సతీశ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, స్థానికులు భారీగా చేరుకుని ప్రమాణ స్వీకారం నిలిపేయాలంటూ ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన బండి ఉదయ్, అజ్మీర రమేశ్.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. గంధం నర్సింహారావును ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆలయం వద్ద ఆందోళన చేస్తున్న వారిని సైతం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అందోళన సద్దుమణగడంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కొనసాగించారు.
స్థానికులకు చోటేది..?
అమ్మవారి ఆలయం కొలువై ఉన్న కేశవాపురం గ్రామస్తులకు కమిటీలో స్థానం కల్పించకుండా ఇతర ప్రాంతాల వారికి, అన్యమతస్తులకు అవకాశం ఇవ్వడం ఏం న్యాయమంటూ స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామస్తులకు అవకాశం కల్పించాలని కోరడం తప్పా అంటూ ప్రశ్నించారు.
చైర్మన్‌గా నాగేశ్వరరావు..
పెద్దమ్మతల్లి ఆలయ పాలక మండలి చైర్మన్‌గా సోములగూడెం గ్రామానికి చెందిన బాలినేని నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. సభ్యులుగా భూక్యా గిరిప్రసాద్, కోరం స్వర్ణలత, పెండ్లి రామయ్య, చందుపట్ల రమ్య, ధర్మరాజుల నాగేశ్వరరావు, చీకటి కార్తీక్, చెవుగాని పాపారావు, చెరుకూరి శేఖర్‌బాబు, దుగ్గిరాల సుధాకర్, శనిగారపు శ్రీనివాసరావు, అడుసుమల్లి సాయిబాబా, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా అర్చకుడు మూర్తి రవికుమార్‌శర్మతో దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు ఈ.వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నాగేశ్వరరావు ఏడో చైర్మన్‌గా నియమితులయ్యారు.

ఆద్యంతం ఉత్కంఠే..

ఆద్యంతం ఉత్కంఠే..