
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొత్తగూడెంలోని గాజులరాజం బస్తీకి చెందిన లిక్కి విశృత్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 1000కి 994 మార్కులు సాధించాడు. విశృత్ స్థానిక నలంద కాలేజీలో ఇంటర్(ఎంపీసీ) చదివాడు. తండ్రి కోటేశ్వరరావు పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా, తల్లి నివేదన నగరంలోని ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేసున్నారు. చిన్నప్పటి నుంచే ప్రణాళికాయుతంగా చదివించడంతో ఉత్తమ ఫలితాలు సాధించాడని విశృత్ తల్లిదండ్రులు తెలిపారు.
ఎస్పీ రోహిత్‌రాజు స్ఫూర్తితో..
ఉత్తమ ఫలితాలు సాఽధించిన అనంతరం విశృత్ మాట్లాడుతూ.. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో చేరడం తన లక్ష్యమని, ఆ తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నది తన జీవిత కల అని తెలిపాడు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న రోహిత్‌రాజు తనకు ఆదర్శమని చెప్పాడు. తండ్రి ఏఎస్‌ఐగా పని చేస్తున్నప్పుడు రోహిత్‌రాజు ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యారని తెలుసుకుని తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆయన తరహాలోనే తన తండ్రి పోలీస్‌గా పని చేస్తున్నప్పుడే తాను ఐఏఎస్ అధికారిని కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. కాగా, ఎస్పీ రోహిత్‌రాజు విశృత్‌ను మంగళ వారం అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విశృత్