
ఆలయాల అప్‌గ్రేడ్..
● ఉమ్మడి జిల్లాలోని పలు దేవస్థానాలకు భక్తుల తాకిడి ● ఖమ్మం జిల్లాలో ఆరు దేవాలయాలు 6ఏ పరిధిలోకి.. ● మరో ఆరింటికి 6 బీ హోదా ● భద్రాద్రి జిల్లాలో ఐదు ఆలయాలు 6సీ నుంచి 6బీకి..
పాల్వంచరూరల్ : ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను అప్‌గ్రేడ్ చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయాలకు భక్తుల తాకిడి పెరుగుతుండగా అంతే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. దీనికి తోడు ఆలయాల్లో ఏటా బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాల, ఇతర పండుగ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. ఇలా ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాల ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు వాటికి గ్రేడ్‌లను పెంచుతుంటారు. తద్వారా భక్తులకు ఆలయాల్లో వసతులు కల్పనతో పాటు సిబ్బంది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం ఆధారంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏడు ఆలయాలకు 6ఏ హోదా ఉండగా కొత్తగా మరో ఆరు ఆలయాలను 6బీ నుంచి 6ఏకు అప్‌గ్రేడ్ చేశారు. భద్రాద్రి జిల్లాలో నాలుగు ఆలయాలు 6ఏ పరిధిలో ఉండగా కొత్తగా ఏ ఆలయమూ అప్‌గ్రేడ్ కాలేదు.
6ఏ ఆలయాలు ఇవే..
ఉమ్మడి జిల్లాలో పాత, కొత్తవి కలిపి మొత్తం 17 ఆలయాలు 6ఏ గ్రేడ్ పరిధిలో ఉన్నాయి. వీటిలో దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయం, పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కొత్తగూడెంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం(గణేష్ టెంపుల్)తో పాటు జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి శ్రీ మారెమ్మతల్లి ఆలయం, పెనుబల్లిలోని శ్రీ నీలాద్రీశ్వరస్వామి, ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి(గుట్ట), కమాన్‌బజార్ శ్రీ వేంకటేశ్వరస్వామి, కాల్వొడ్డులోని సత్యనారాయణ సహిత వీరాంజయనేయస్వామి, వేంసూరు మండలం కందుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు గతంలోనే 6ఏ పరిధిలో ఉండగా కొత్తగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల శ్రీ సంగమేశ్వరస్వామి, మధిరలోని మృత్యుంజయస్వామి, ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లేశ్వరస్వామి, ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మ తల్లి, ఖమ్మం ఇందిరానగర్ శ్రీ సీతారామచంద్రస్వామి(పర్ణశాల) ఆలయాలు అప్‌గ్రేడ్ అయ్యాయి.
6బీ హోదా పొందిన ఆలయాలు..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం శ్రీమల్లికార్జునస్వామి, కొణిజర్ల మండలం పల్లిపాడు శ్రీ శంభులింగేశ్వరస్వామి, కూసుమంచి మండలం పెరికసింగారం శ్రీవేణుగోపాల అంజనేస్వామి, ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్ శ్రీసీతారామాంజనేయస్వామి, కామేపల్లి మండలం కొత్తలింగాల శ్రీ కోటమైసమ్మ, ఖమ్మం వరదయ్యనగర్‌లోని శ్రీమైసమ్మ అమ్మవారి ఆలయాలు 6బీ హోదా పొందాయి. వీటితో పాటు భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి శ్రీదాసాంజనేయస్వామి, కొత్తగూడెం బాబూక్యాంప్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి, జూలూరుపాడు మండలం పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వరస్వామి, పాల్వంచలోని శ్రీ రామాలయం (భజనమందిరం), అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం ఉన్నాయి.
భక్తుల రద్దీ, ఆదాయం ఆధారంగా..
ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాలకు భక్తుల తాకిడి, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గ్రేడ్‌లు నిర్ణయిస్తారు. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం ఉంటే 6ఏ, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటే 6బీ, రూ.2లక్షల లోపు ఆదాయం లభించే ఆలయాలకు 6సీ హోదా కల్పిస్తాం. – వీరస్వామి, దేవాదాయ శాఖ ఏసీ

ఆలయాల అప్‌గ్రేడ్..