
కొత్త క్వార్టర్లు నిర్మించేనా..?
● శిథిలావస్థలో కేటీపీఎస్ నివాస సముదాయాలు ● అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న కార్మికులు ● నిర్మాణాలపై దృష్టి సారించని జెన్ కో యాజమాన్యం
పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ కర్మాగారాల్లో పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఇక్కడి ఉద్యోగులకు నివాస సముదాయాలు(క్వార్టర్లు) సక్రమంగా లేవు. దశాబ్దాల క్రితం నిర్మించినవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. కేటీపీఎస్ ఒఅండ్‌ఎం కర్మాగారం నిర్మించిన సమయంలో ఉద్యోగుల కోసం ఏ,బీ,సీ, ఇంటర్మీడియట్, బాంబే కాలనీలుగా క్వార్టర్ల సముదాయాలు నిర్మించారు. అప్పుడే క్వార్టర్లు నిర్మించినా చాలా ఎత్తు తక్కువ, ఇరుకు గదులతో నిర్మాణాలు చేపట్టారు. సరైన ప్రహరీలు కూడా లేవు. కాలనీల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఒఅండ్‌ఎం కర్మాగారం కాలం చెల్లడంతో ఆ కర్మాగారాన్ని కూల్చివేశారు. క్వార్టర్లు కూడా శిథిలావస్థకు చేరాయి. దీంతో 80 శాతం మంది కార్మికులు కార్టర్లను ఖాళీ చేసి ప్రైవేటు ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నారు. కొందరు రుణాలు తీసుకుని సొంత ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
శిధిలావస్థకు చేరిన క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిత్యం కొందరు యువకులు, గంజాయి, మద్యం సేవించడం, ఇతర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ క్వార్టర్ల తలుపులు, కిటికీలు, ఐరన్ సామగ్రి చోరీకి గురవుతున్నాయి. కేటీపీఎస్ ఒఅండ్ కర్మాగారం మూతబడటంతో సుమారు 2500 మంది ఉద్యోగ, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. దీంతో కాలనీలు జన సంచారం లేకుండా వెలవెలబోతున్నాయి. గతంలో కన్యూమర్ స్టోర్స్, పాల ప్యాకెట్లు, గ్యాస్ బుకింగ్, గోడౌన్, ఇతర కూల్ డ్రింక్ షాపులు ఉండేవి. ప్రస్తుతం అవన్నీ మూతబడ్డాయి.
నిధుల విడుదలలో జాప్యం
పాల్వంచ కేటీపీఎస్ కేంద్రంగా 5,6దశల కర్మాగారాల్లో వెయ్యి మెగావాట్లు, 7వ దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 1969–78 సంవత్సరంలో ఒఅండ్‌ఎం కర్మాగారం నిర్మించగా కాలం చెల్లడంతో తొలగించారు. ఆ స్థానంలో 7వ దశ నిర్మాణం జరిపారు. ఇటీవల మణుగూరులో నిర్మించిన బీటీపీఎస్ సిబ్బంది కోసం రూ.600 కోట్లతో క్వార్టర్ల నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ కూడా పాత నిర్మాణాలు తొలగించి వాటి స్థానంలో అపార్ట్‌మెంట్ తరహాల్లో నిర్మాణాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కావడంలేదు. యాజమాన్యం కూడా దృష్టి సారించడం లేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా జెన్‌కో యాజమాన్యం స్పందించి క్వార్టర్లను నిర్మించాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
కేటీపీఎస్‌లో ఉద్యోగుల కొత్త క్వార్టర్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే పనులు చేపడతాం. ఈ విషయం యాజమాన్యం దృష్టిలో ఉంది. త్వరలో మంజూరు అవుతాయని వేచి చూస్తున్నాం.
–కె.శ్రీనివాసబాబు, సీఈ, 7వ దశ

కొత్త క్వార్టర్లు నిర్మించేనా..?

కొత్త క్వార్టర్లు నిర్మించేనా..?