
వడదెబ్బతో మహిళ మృతి
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన తౌటం వజ్రమ్మ(60) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురికాగా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం వరంగల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
బైక్‌ను లారీ ఢీకొని
ఒకరు..
బూర్గంపాడు: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం పట్టణానికి చెందిన పసుపుతోట నాగేశ్వరరావు (65) బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని ఓ మిల్లులో పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఈ క్రమంలో లక్ష్మీపురం బంకు సమీపంలో పాల్వంచ వైపు నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నాగేశ్వరరావు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బొగ్గు చోరీ
ఇల్లెందు: సింగరేణి బొగ్గు అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను సెక్యూరిటీ విభాగం పట్టుకుని పోలీసులకు అప్పగించింది. సోమవారం మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన బి.రాజు, కె. ప్రసాద్‌లు ఓ ట్రాక్టర్ ద్వారా సింగరేణి బొగ్గు చోరీ చేసుకుని వెళుతుండగా రాజీవ్‌నగర్ తండా వద్ద పట్టుకున్నారు. ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది రామస్వామి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి సూర్య కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేశారు.
మద్యం మత్తులో దాడి
ఇల్లెందు: మండలంలోని ధనియాలపాడు గ్రామానికి చెందిన పి.రమాదేవి ఇంటికి సోమవారం సుదిమళ్లకు చెందిన ఆమె సమీప బంధువు వచ్చాడు. మద్యం తాగి అల్లరి చేస్తుండటంతో ప్రశ్నించిన రమాదేవి, ఆమె కుమారుడు సంతోష్‌ను తీవ్రంగా దాడి చేసి గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హసీనా కేసు నమోదు చేశారు.