
నిర్లక్ష్యం నీడన నిరసనల వేదిక
● పడావుగా మారుతున్న ధర్నాచౌక్ స్థలం ● కలెకర్టేట్ ఎదుటే కొనసాగుతున్న ఆందోళనలు ● చదును చేసి ఫెన్సింగ్ వేయాలని విన్నపాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారం కోసం వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపే కలెక్టరేట్ ధర్నాచౌక్ నిర్లక్ష్యానికి గురవుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత చాలా ఆలస్యంగా కలెక్టరేట్ సమీపంలో ధర్నాచౌక్‌కు స్థలాన్ని కేటాయించారు. కానీ ఆ స్థలాన్ని చదును చేసి కనీస సౌకర్యాలు కల్పించలేదు. ధర్నా చౌక్ ఏర్పాటు తర్వాత వివిధ సమస్యలపై ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఇబ్బడిముబ్బడిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో ధర్నా స్థలం కొంత శుభ్రంగా ఉండేది. ఎన్నికల కోడ్‌లు వచ్చిన సందర్భంగా ధర్నాలకు, ఆందోళనలకు బ్రేక్ పడింది. కోడ్ ముగిశాక మళ్లీ ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ధర్నాచౌక్ స్థలం అనుకూలంగా లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుటే నిరసన తెలుపుతున్నారు. మరికొందరు కలెక్టరేట్ ఎదుట గేట్ ముందు కాకుండా ఏకంగా కలెక్టరేట్ ఆవరణలోనే ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక ధర్నాచౌక్‌ను ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి పడావుగా మారుతోంది. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగే సమయంలో జనసమీకరణ ఎక్కువగా ఉంటుంది. కలెక్టరేట్ ఎదుటే జాతీయ ప్రధాన రహదారి ఉండటంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఏదైనా వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే నిరసన చేపడుతున్న ఆందోళకారులపైకి దూసుకు వెళ్తే జరిగే ప్రాణనష్టం ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇప్పటికై నా ధర్నాచౌక్ స్థలం చదును చేసి ఫెన్సింగ్ వేయాలని, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పరిష్కార వేదికే సమస్య కావొద్దు
సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు వేదిక ధర్నాచౌక్. అలాంటి ప్రాంతమే సమస్యగా మారొద్దు. జిల్లా యంత్రాంగం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలి.
– ఎస్‌కె సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి
నిర్లక్ష్యం సరికాదు
రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా మనది. ఉద్యమాలకు పెట్టింది పేరు. అలాంటి జిల్లాలో ధర్నాచౌక్ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఉద్యమాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి. వేదికను ఏర్పాటు చేయాలి.
–మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి

నిర్లక్ష్యం నీడన నిరసనల వేదిక

నిర్లక్ష్యం నీడన నిరసనల వేదిక