సమ్మర్ క్యాంపులు..
సర్కారు స్కూళ్లలో
ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ అధికారులు
● వివిధ రకాల క్రీడల్లో, యోగా శిక్షణకు ఏర్పాట్లు.. ● ప్రైమరీలో రీడింగ్, రైటింగ్ నైపుణ్యం పెంచే చర్యలు ● వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 23వ తేదీతో విద్యా సంవత్సరం ముగియనుండగా, 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఫైనల్ ఎస్‌ఏ–2 పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో పాఠశాలల్లోనే సమ్మర్ క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. సమ్మర్ క్యాంపుల్లో గతంలో యోగా శిక్షణ ఇచ్చేవారు. ఈయేడాది అన్ని రకాల క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పాఠశాలలో రూ.20 వేల విలువైన అన్ని రకాల క్రీడా పరికరాలు వచ్చి ఉన్నాయి. క్రీడల నిర్వహణ, శిక్షకుల, ఎలా శిక్షణ ఇవ్వాలి తదితర అంశాలపై ఎంఈఓలు, హెచ్‌ఎంలతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సమ్మర్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠ్యంశాలు, బోధనలు లేని క్రీడలతో పాటుగా వినోదాత్మక అంశాలను కూడా జోడించి క్యాంపులు నిర్వహించనున్నారు. దీంతో వేసవి సెలవుల్లో కూడా పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి.
విత్తనాల సేకరణకు ప్రత్యేక బహుమతులు
ఈ నెల 24 నుంచి వేసవి సెలవుల్లో విద్యార్థులు విత్తనాలు సేకరించాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సూచించారు. పూలు, పండ్లు, ఆకుకూరలకు సంబంధించిన విత్తనాలను సేకరించి, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాక ఆ విత్తనాలను పాఠశాలలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎక్కువగా విత్తనాలు సేకరించిన విద్యార్థులు, పాఠశాలలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించనున్నారు. సేకరించిన విత్తనాలను ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి అడవుల్లో చల్లే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉదయం 7 నుంచి 11 గంటల వరకు..
జిల్లాలో 1,299 ప్రభుత్వ పాఠశాలల్లో 63,399 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ సమ్మర్ క్యాంపులు జరిగే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం పెంచేందుకు రీడింగ్, రైటింగ్ నోట్ పుస్తకాలను అందజేయనున్నారు. ఇళ్ల వద్దనే రీడింగ్, రైటింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైమరీ విద్యార్థులు వారు ఆడేగలిగే క్రీడల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్, షటిల్, ఫుట్‌బాల్, చెస్ వంటి క్రీడలు నిర్వహించనున్నారు. ఎండదెబ్బ తగలకుండా విద్యార్థులకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాల్లో ఉన్న ఎల్‌ఈడీ టీవీల్లో విద్యార్థులకు ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను సైతం ప్రదర్శించనున్నారు. ఇక ఉపాధి హామీ కార్మికులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నారు. నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టనున్నారు.
సమ్మర్ క్యాంపులు..


