కేజీబీవీల్లోనూ చార్జీల పెంపు
● విద్యార్థినులకు కాస్మొటిక్స్, డైట్ బిల్లులు పెంచుతూ నిర్ణయం ● ఉమ్మడి జిల్లాలో 28 కేజీబీవీలు.. 8,480 మంది బాలికలు ● పెరిగిన చార్జీల అమలుతేదీపై కొరవడిన స్పష్టత
పాల్వంచరూరల్ : ఎట్టకేలకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో కాస్మొటిక్స్, డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 13న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు చార్జీలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా కేజీబీవీ విద్యార్థినులకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అమలు చేసిన చార్జీలకు, నిత్యం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల్లో తేడాలు ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ క్రమంలో కస్తూ ర్బా విద్యార్థినులకూ డైట్, కాస్మొటిక్స్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
గతంలో అన్ని తరగతులకూ ఒకే చార్జీలు..
గతంలో 6 నుంచి ఇంటర్మీడిఝెట్ వరకు అన్ని తరగతుల విద్యార్థినులకు డైట్ చార్జీలు నెలకు రూ.1,225, కాస్మొటిక్స్ చార్జీలు రూ.100 చెల్లించేవారు. కాగా, తాజా నిర్ణయం ప్రకారం 6, 7 తరగతుల వారికి డైట్ చార్జీలు రూ.1,330 చొప్పున, కాస్మొటిక్స్ చార్జీలు రూ.175 చెల్లించాలని నిర్ణయించారు. ఇక 8, 9, 10 తరగతుల విద్యార్థినులకు డైట్ చార్జీలు రూ.1,540, కాస్మొటిక్స్ చార్జీలు రూ.275 ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థినులకు డైట్ చార్జీలు రూ.2,100, కాస్మొటిక్స్ చార్జీలు రూ.275 చొప్పున చెల్లించనున్నారు.
ఉమ్మడి జిల్లాలోని 28 విద్యాలయాల్లో..
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 14, భద్రాద్రి జిల్లాలో 14 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 6 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థినులు 4,780 మంది ఉండగా, భద్రాద్రి జిల్లాలో 3,700 మంది ఉన్నారు. బాలికలకు బలవర్థకమైన ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మెనూ బిల్లులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బాలికల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో నెలలో నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్ వడ్డించడమే కాక, బుధవారం మినహా మిగితా రోజుల్లో అరటి, లేదా సీజనల్ పండ్లు, సేమియా, గులాబ్‌జామ్, అటుకులు, స్నాక్స్, పల్లీపట్టి, మిక్చర్, టీ అందించాల్సి ఉంది. పాత మెనూ ప్రకారం వాటిని అమలు చేయాలంటే విద్యార్థినులకు వచ్చే బిల్లులు సరిపోక అరకొరగా పెట్టాల్సి వచ్చేది. కొన్ని స్కూళ్లలో అయితే చికెన్, మటన్ పెట్టిన సందర్భాలు తక్కువే. గత చార్జీలతో మెనూ పక్కాగా అమలు చేయడం అధికారులకు ఇబ్బంది గానే ఉండగా ప్రస్తుతం చార్జీల పెంపుతో కేజీబీవీ కో ఆర్డినేటర్లు, ప్రత్యేకాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమలుపై కొరవడిన స్పష్టత..
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థినులకు పౌష్టికాహారం, కాస్మొటిక్స్ చార్జీలు పెంచినా.. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో నిర్దిష్ట తేదీ పేర్కొనలేదు. మరో 10రోజులు దాటితే వేసవి సెలవులు వస్తాయి. అయితే పెరిగిన చార్జీలు ఈ నెలలో అమలు చేస్తారా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తారా అనేది స్పష్టత రాలేదని కేజీబీవీల ప్రత్యేకాధికారులు చెబుతున్నారు.


