వైభవంగా మహదాశీర్వచనం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు వేద పండితులు మహదాశీర్వచనం అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురాగ్యోలు ప్రసాదించాలని కోరుతూ ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామివారికి మహదాశీర్వచనం అందజేయడం అనాధిగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ ఎల్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
చాతకొండ బెటాలియన్ అభివృద్ధికి రూ.20 లక్షలు
ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెంఅర్బన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్‌లో అభివృద్ధి పనుల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఐ జీ.వీ.రామారావుకు మంగళవారం ఖమ్మంలో అందజేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తే బెటాలియన్‌లో సెల్యూటింగ్ డయాస్, గ్యాలరీ నిర్మాణ పనులు చేపడతామని వారు వెల్లడించగా, ఎంపీ రూ.20లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఎంపీకి కమాండెంట్ కృతజ్ఞతలు తెలిపారు.
రేపు జాబ్‌మేళా
సింగరేణి(కొత్తగూడెం): పాల్వంచ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పాన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేపీఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో 25 ఖాళీలు, ముత్తూట్ మైక్రోఫైనాన్స్ కొత్తగూడెం బ్రాంచ్‌లో 20 ఖాళీల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.
కార్మికుల ఆరోగ్య
పరిరక్షణే ధ్యేయం
సింగరేణి సీఎంఓ కిరణ్ రాజ్‌కుమార్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణే సంస్థ ధ్యేయమని సీఎంఓ కిరణ్ రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంస్థ నిబంధనల మేరకు కార్పొరేట్ మెడికల్ బోర్డును పారదర్శకంగా నిర్వహిస్తామని, దళారీ వ్యవస్థను అరికడతామని తెలిపారు. కార్మికులకు ఏదైనా జబ్బు చేస్తే సకాలంలో సరైన మందులు అందించేలా ఏడు ఏరియాల్లోని 21 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా సింగరేణి ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. రామగుండం రీజియన్ ఆస్పత్రిలో కార్డియో క్యాత్‌లాబ్ ఏర్పాటు చేసి గోల్డెన్ హవర్ సేవలు అందించేందుకు రూ.13 కోట్లతో పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల్లో గర్భిణుల డెలివరీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తప్పని పరిస్థితుల్లోనే ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు.
వైభవంగా మహదాశీర్వచనం


