రోజుకు 8 గంటలు పనిచేయాలి
● యంత్రాల వినియోగం పెంచాలి ● 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు ● సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ వెల్లడి
మణుగూరు టౌన్: ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాలని, యంత్రాల వినియోగాన్ని 22 గంటలకు పెంచాలని సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన మణుగూరు ఏరియాలోని పీకేఓసీ, కొండాపురం భూగర్భగని, మణుగూరు ఓసీలను సందర్శించారు. ఓసీ–2లో నూతన సైట్ ఆఫీస్‌తో పాటు కేపీయూజీ మైన్ రెస్క్యూ స్టేషన్‌ను, ఓసీ–4 ప్రీ వెయిట్ ట్రక్ లోడింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యంత్ర సామర్థ్య వినియోగంలో పీకేఓసీ ఉత్తమ గని అవార్డు సాధించడం అభినందనీయమని, కార్మికులు, అధికారులు ఇదే ఒరవడి సాగించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని అధిగమించి 127 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు, కోలిండియా నుంచి సింగరేణికి గట్టి పొటీ ఎదురవుతోందని, దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బ్లాక్‌ల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌తో పాటు కొత్తగూడెం వీకే, ఇల్లెందులోని రొంపేడు ఓసీ, గోలేటి(బెల్లంపల్లి) ఓసీలను ప్రారంభించేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా 245.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, వీటిని 1000 మెగావాట్లకు పెంచాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ రంగాల వ్యాపార విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మణుగూరు పీవీ కాలనీ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌సీ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్‌ను నియమిస్తామన్నారు. అంతకుముందు కార్మికులతో కలిసి క్యాంటీన్‌లో అల్పాహారం చేసి నాణ్యతపై ఆరా తీశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, ఎల్.వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం దుర్గం రాంచందర్, జీఎంలు సురేశ్, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఓటు డైరెక్టర్ కేవీరావు, ఏజీఎం బొజ్జ రవి, అధికారులు లక్ష్మీపతిగౌడ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, వెంకట్రావ్, రమేశ్, శ్రీనివాస్, అనురాధ, బాబుల్ రాజ్, యూనియన్ నాయకులు రాంగోపాల్, కృష్ణంరాజు, వెంకటరత్నం పాల్గొన్నారు.


