● ఆలస్యంగా ప్రారంభం కావడంతో భక్తుల్లో అనుమానాలు ● ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వేడుకోలు ● స్టేడియంలో ఓపెన్ షెడ్ నిర్మాణం ఈ ఏడాదికి లేనట్టే ! ● ఇప్పటికీ పునాదులకే పరిమితమైన పనులు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే శ్రీసీతారాముల కల్యాణం, పట్టాభిషేక బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ఉగాది రోజున ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పలు పనులు దేవస్థానం ఆధ్వర్యంలో చేపడతారు. ఈ మేరకు ఇటీవలే రూ.కోటి విలువైన పనులకు అధికారులు టెండర్లు ఖరారు చేశారు. భద్రాచలంలో మూడు వైపులతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సిద్ధం చేస్తున్నారు. మిథిలా స్టేడియం ప్రాంతంలో హోర్డింగ్‌లకు రంగులు అద్దుతున్నారు. కరకట్ట దిగువ భాగాన ఏర్పాటు చేసిన రామాయణ ఇతివృత్తాల బొమ్మలకు సైతం పెయింటింగ్ వేస్తున్నారు. కరకట్ట ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఇక తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటుగా ఇతర పనులు ప్రారంభించాల్సి ఉంది.
ఓపెన్ షెడ్ లేనట్టే..
ప్రసాద్ పథకంలో భాగంగా మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ షెడ్ ఈ ఏడాది శ్రీరామనవమికి లేనట్టేనని స్పష్టమవుతోంది. ఈ ఓపెన్ షెడ్ నిర్మాణంలో నిర్లక్ష్యంపై ఫిబ్రవరి 22న సాక్షిలో ‘నలభై రోజుల్లో నవమి.. పునాదుల్లో పనులు’ అనే కథనం ప్రచురితమైంది. ఇందులో దేవస్థానం, టూరిజం ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపింది. అనుకున్నట్టుగానే ఈ ఓపెన్ షెడ్ నిర్మాణాన్ని ఈ నవమికి అందించలేమని సంబంధిత కాంట్రాక్టర్ జిల్లా ఉన్నతాఽధికారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. కేవలం పునాదుల వరకు మాత్రమే పూర్తి చేస్తామని చెప్పి ఆ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆ పునాదుల పనులు మాత్రమే నడుస్తున్నాయి. ఇవి పూర్తయిన అనంతరం సెక్టార్ల విభజన, బారికేడింగ్ ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. దీనిపై దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు సైతం పరిస్థితిని అంచనా వేసి టూరిజం శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాల్సి ఉండగా మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని భక్తులు అంటున్నారు. ఇప్పటికై నా ఇటు దేవస్థానం, అటు జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని భక్తులతో పాటు భద్రాద్రి పట్టణ వాసులు కోరుతున్నారు.
హడావిడిగా పనులు చేయొద్దు..
ప్రతీ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు నెలరోజుల ముందుగానే టెండర్లు ఖరారు చేసేవారు. అయితే ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ ప్రక్రియలో చాలా ఆలస్యం జరిగింది. అయితే సమయం తక్కువగా ఉందనే సాకుతో పనులు హడావిడిగా, నాణ్యత లేకుండా చేపట్టే అవకాశం ఉంటుందని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. గతంలో ఎక్కువ సమయం ఉన్నప్పుడే నవమికి ముందు రోజు రాత్రి డివైడర్లకు, రోడ్లకు పెయింటింగ్ వేసి తూతూ మంత్రం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఏడాది పాటు ఖాళీగా ఉంచి నవమికి కొద్ది రోజుల ముందు పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేస్తున్న శాశ్వత మరుగుదొడ్ల పనులను సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు.