గవర్నర్ నుంచి పతకం స్వీకరించడం ఆనందకరం చిన్ననాటి కల సాకారమైందని జిల్లా కలెక్టర్ వ్యాఖ్య
భూముల సర్వేలో సమస్యలు అధిగమించాలి
బాపట్ల: చిన్నతనంలో కన్న కలలు నేడు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ మండలాల నుంచి వచ్చిన వారి నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చిన్నతనంలో చదువుకునే రోజుల్లో జిల్లా కలెక్టర్లు గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్న దృశ్యాలను టీవీలో చూసేవాడినని గుర్తుచేసుకున్నారు. తాను కూడా భవిష్యత్తులో అలా అవార్డు అందుకోవాలని కలలు కన్నానని చెప్పారు. ఆ కల నేడు సాకారం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం బాపట్ల జిల్లాలో అత్యధిక సంఖ్యలో రెడ్‌క్రాస్ సభ్యులను చేర్పించడంలో జిల్లా అధికారులు, సిబ్బంది కృషికి గుర్తింపుగా మరో గోల్డ్ మెడల్ అందుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జిల్లా ఫ్లాగ్ డే ఫండ్‌కు అధిక మొత్తంలో నిధులు సేకరించినందుకు స్వర్ణ పతకం లభించిందన్నారు. తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్ ఆసుపత్రికి సంబంధించిన అన్ని రకాల ఫైళ్లను సకాలంలో క్లియర్ చేయడంలో చేసిన కృషికి కూడా గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ఎల్. ప్రభాకర్ రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీఎఫ్‌ఓ పి. సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 152 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులు అందజేసిన సమస్యలకు పరిష్కారంచూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. మొత్తం 152 మంది తమ సమస్యలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత వారంలో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన భట్టిప్రోలు మండల తహసీల్దార్ నాగరాజును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీపీఓ ఎల్. ప్రభాకర్ రావు, సీపీఓ ఎ.ఎస్. రాజు, పీడీలు బి. సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద్ సత్యపాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, డీఈఓ శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్‌ఎస్ పద్మావతి, డీటీసీ పరంధామ రెడ్డి, ఆర్‌టీసీ ఆర్‌ఎం విమల, జీఎం డీఐసీ రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిణి పద్మావతి, జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎస్‌ఓ జగన్మోహన్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆర్డీవోలు, మండల తహసీల్దార్లు, సర్వేయర్లతో సోమవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రజా అభిప్రాయ సేకరణలో ఫిర్యాదులపై ఆయన ఆరా తీశారు. వేమూరు పెరవల్లి గ్రామం సర్వేయర్ ఎం. శిరీష, బాపట్ల మండలం మూలపాలెం సర్వేయర్ ఎన్. బాలాజీ, అనంతవరం సర్వేయర్ అన్వర్ బాషా, రేపల్లె సర్వేయర్‌పై అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శేషగిరిరావు, అల్తాఫ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు హరికుమార్, నరసింహారావు, శ్రీదేవి, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.


