తెనాలి: భూటాన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ గోల్ షాట్‌బాల్ సబ్–జూనియర్స్ బాయ్స్–గర్ల్స్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు రెండూ విజయం సాధించాయి. ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఫైనల్స్‌లో రెండు విభాగాల్లోనూ భూటాన్ జట్లతో తలపడిన భారత జట్లు విన్నర్స్‌గా నిలిచాయి. స్థానిక సుల్తానాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌కు చెందిన నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు చొప్పున రెండు జట్లలోనూ ఏడుగురు క్రీడాకారులు దేశం తరఫున ఆడారు. రెండు జట్లు విన్నర్స్‌గా నిలిచినందున ఆయా జట్లలో ఆడిన చిల్కా రుత్విక్ కిరణ్, పెదపల్లి సుహాస్, చుండూరు హర్షద్ గౌతమ్ దేవరకొండ అమూల్య, చుండూరు జెస్విత, దాసరి జెన్సినా జాయల్, చిలకా ప్రజ్ఞను సోమవారం సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం సత్కరించింది. అంతర్జాతీయ పోటీల్లో ఇంటర్నేషనల్ కోచ్‌గా స్కూల్ పీఈటీ ఎన్.వినోద్ కుమార్ మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల విజయానికి నిరంతరం ప్రోత్సాహం, సహకారం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ సౌమ్య, కరస్పాండెంట్ సిస్టర్ లీసా జార్జ్, పీఈటీలు వినోద్‌కుమార్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.9,69,418 వచ్చినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. సోమవారం అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు బాపట్ల దేవదాయ శాఖ డివిజన్ ఇన్‌స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో నిర్వహించారు. లెక్కింపులో ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు, పలు భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ 99 రోజుల తరువాత అమ్మవారి హుండీ లెక్కించినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి రూ.2,03,834 అదనంగా వచ్చినట్లు తెలిపారు.
అమరావతి: అమరేశ్వర ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ సోమవారం పేర్కొన్నారు. యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల నేతృత్వంలో జరిగే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం వేద పండితులచే ఉదకశాంతి, ఆలయ శుద్ధి, ప్రధాన ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రెండో రోజు బుధవారం మండప పూజలు, దీక్షా హోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం మూడో రోజు గురువారం ప్రాయశ్చిత్తహోమం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం ఉంటాయన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 536.80 అడుగులకు చేరింది. కుడి కాలువకు 6,660, ఎడమ కాలువకు 7,029, ఎస్‌ఎల్‌బీసీకి 2 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. మొత్తం ఔట్‌ఫ్లోగా 15,689 క్యూసెక్కులు వెళుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 1,259 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


