రూ.1.15 కోట్లకు మోసం | - | Sakshi
Sakshi News home page

రూ.1.15 కోట్లకు మోసం

Mar 18 2026 9:40 AM | Updated on Mar 18 2026 9:40 AM

సుమారు రెండేళ్లకు పైగా కాళ్లరిగేలా తిరుగుతున్నాం.. గుంటూరు వస్తుంటే చంపుతామని బెదిరిస్తున్నారు జిల్లా కలెక్టర్‌, జేసీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసిన తెలంగాణ మిర్చి రైతులు

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : సుమారు రెండేళ్లకుపైగా మిర్చి డబ్బులు కోసం కాళ్లు అరిగేలా పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తున్నామని బాధిత మిర్చి రైతులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా తనగల గ్రామ వాసులు బోయ నారాయణ, పచ్చర్ల రాజు, ఈడిగ నరసింహగౌడ్‌, కురవ వెంకటేశ్‌ (సర్పంచ్‌), ఉప్పర లక్ష్మణ (షాబాదా గ్రామం)లు మంగళవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత రెండేళ్లుగా చవి చూసిన కష్టాలను మొరపెట్టుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందించారు.

అనంతరం మిర్చి బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరులోని రెండు చిల్లీస్‌ ట్రేడింగ్‌ సంస్థల నిర్వాహాకులకు మిర్చి బస్తాలు పంపించేవాళ్లమని అన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం 2,300 మిర్చి బస్తాలు తీసుకురాగా, ప్రస్తుతం ధరలేదని ఓ కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేయాలని నిర్వాహాకులు సూచించారని చెప్పారు. వారి చెప్పినట్లుగానే సదరు స్టోరేజీలో నిల్వ చేశామన్నారు. నిర్వాహాకులను డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అంటూ దాటవేశారు. దీంతో అనుమానం వచ్చి స్టోరేజీలో ఆరాతీయగా మా పేర్లపై మిర్చి బస్తాల్లేవని, నిర్వాహాకులు, వారి కుటుంబ సభ్యులపై ఉన్నాయని అన్నారు. మేమంతా మోసపోయిన గుర్తించి నిర్వాహాకులను గట్టిగా అడిగితే, మిర్చి విక్రయించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీనికిగాను చెక్కులు, ప్రామిసరీనోట్లు, రూ.100ల అగ్రిమెంట్‌లు రాసిచ్చారని అన్నారు. అలాగే గుంటూరు లాలుపురంలో స్థలం, కర్నూలులో ఎకరంన్నర పొలం విక్రయించగా వచ్చే డబ్బులు చెల్లిస్తామని బురిడి మాటలు చెప్పారని వాపోయారు. అయితే ఆ చెక్కులు, అగ్రిమెంట్‌ ఇతరత్రా కాగితాలు వల్ల ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్సి మోసగించి, రూ.1.15 కోట్లు చెల్లించకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రం నుంచి వందలాది కి.మీ ప్రయాణించి గుంటూరు వస్తుంటే సదరు ట్రేడింగ్‌ నిర్వాహాకులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. సదరు ట్రేడింగ్‌ కంపెనీల నిర్వాహాకులను నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement