మంగళగిరి టౌన్: పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాల యాజమాన్యం వ్యవహరించిందని హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ అన్నారు. ఆత్మకూరు నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాల నందు 2024– 25లో 83 మంది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ మార్కుల జాబితాలు జారీ చేయని నేపథ్యంలో వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిల్లలకు ఒరిజినల్ మార్కుల జాబితాలను అందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై పిల్లల తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ, పిల్లల తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్ బేతపల్లి మాట్లాడుతూ, 2024–25లో నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగిందని తెలిపారు. ఈనెల 9వ తేదీన జస్టిస్ న్యాపతి విజయ్ రెండు వారాల లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పు ఇవ్వటం సంతోషించదగ్గ విషయమని అన్నారు.
హైకోర్టు అడ్వకేట్
బేతపల్లి సూర్యనారాయణ


