వేర్వేరు కేసుల్లో ఇద్దరు చోరుల అరెస్టు
సుమారు రూ.38 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం
నగరంపాలెం (గుంటూరు వె స్ట్): చోరీ కేసుల్లో ఇద్దరు పాత నేరస్తులను దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేసి, సుమారు రూ.38 లక్షల విలులైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... దుగ్గిరాల గ్రామం బ్రాహ్మణబజార్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగిందన్నారు. దీనిపై దుగ్గిరాల పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ వెంకటరవి కేసు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, సాంకేతిక ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసి పాత నేరస్తుడైన చిప్పాడ కేదారేశ్వరరావు(40)ని అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. ఐదు కేసులకు సంబంధించి రూ.16.32 లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అతనిపై నలభైకిపైగా చోరీ కేసులు ఉన్నాయని అన్నారు.
మరో ఘటనలో...
చింతలపూడి గ్రామానికి చెందిన కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో వారింట్లో సుమారు రూ.20 లక్షల ఖరీదైన బంగారు, వెండి వస్తువులు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో నెహ్రూనగర్ వాసి ఇమడాబత్తిని గోపి (38)ని మంగళగిరి షరాఫ్‌బజార్‌లో అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. విచారణలో నేరం రుజువుకావడంతో రూ.20.40 లక్షల విలువైన బంగారం, రూ.1.11 లక్షల ఖరీదైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. గోపీ కార్పెంటర్ అని, అతనిపై కొత్తపేట పీఎస్‌లో ఒక కేసు ఉందని తెలిపారు. కేసులను త్వరగా ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్ ఎస్‌ఐ వెంకటరవి, బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రశంసాపత్రాలు అందించారు.


