మాతాశిశు మరణాలను అరికట్టాలి
బాపట్ల: మాతాశిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్వస్థ కార్యక్రమంలో భాగంగా మాతాశిశు మరణాలు అరికట్టడంపై వైద్యాధికారులతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రక్తహీనతతో హై రిస్క్ ఉన్న గర్భిణులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా, సాధారణ కాన్పులు జరిగేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ అరికట్టగలిగితే మాతాశిశు మరణాలను నియంత్రించగలమన్నారు. వైద్యులకు అవగాహన కల్పించి సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ప్రధానమంత్రి సూర్య ఘర్ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నూరు శాతం సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అక్కడ ఉండేలా చూడాలన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం పిట్టలవానిపాలెం గ్రామంలో 12,036 , చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో 16,931, పర్చూరు నియోజకవర్గంలో కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో 11,667, రేపల్లె నియోజకవర్గంలో చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో 7,192, వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో 8,300 గృహాలకు సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
వయోజనుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచాలి
వయోజనుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అక్షరాంధ్ర కార్యక్రమాల అమలుపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం ఆయన హైబ్రిడ్ మోడ్ లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయడం లక్ష్యమన్నారు. మార్చి 15వ తేదీన పరీక్షలు ఉంటాయన్నారు. కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్


