విజయకీలాద్రిపై ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా సీతా నగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్‌స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ యోగాంజేయ స్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం శ్రీ నారసింహ హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : జెడ్పీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ (డీపీఆర్‌సీ) భవనాన్ని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని బుధవారం పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గుంటూరు జిల్లాకు వచ్చిన సుశీల్ కుమార్ లోహాని డీపీఆర్‌సీ నిర్మాణ పనుల ప్రగతి, నిర్మాణ వ్యయం తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీపీవో నాగ సాయి కుమార్, డ్వామా పీడీ వి.శంకర్ పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పేపర్–1కు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల పరిధిలో 35,306 మంది హాజరయ్యారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని ఎస్‌ఆర్ కళాశాల, అయ్యప్పస్వామి గుడి ఎదుట ఉన్న నారాయణ జూనియర్ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును గమనించారు. ఆయా కేంద్రాలలో వసతులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌ఐవో జి.సునీత ఉన్నారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మారుతీనగర్‌లోని కంచి కామకోటి పీఠ మారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఏడవ రోజుకు చేరాయి. శ్రీబ్రహ్మానంద సరస్వతి స్వామి (విజయవాడ) జ్యోతిప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. సామూహిక తులసి పూజలు చేపట్టారు. శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
విజయకీలాద్రిపై ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
విజయకీలాద్రిపై ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు


