సత్తాచాటిన పల్నాడు ఎడ్లు
యర్రగొండపాలెం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం ప్రారంభమైన ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన ఎడ్లు సత్తాచాటాయి. మొదటి రోజు రెండు పళ్ల విభాగం ఎడ్లకు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 22 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన ఎడ్లు 3,442.4 అడుగుల బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు యర్రం రాజశేఖర్, యశ్వంత్‌లు రూ.50 వేల నగదు బహుమతితోపాటు షీల్డ్‌ను అందుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని చుండూరుకు చెందిన ఎడ్లు 3,418.9 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు అత్తోటి శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి రూ.40 వేల నగదు బహుమతితోపాటు షీల్డ్ అందుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కొండేపాడు గ్రామాలకు చెందిన ఎడ్లు 3,246.8 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు పొన్నెబోయిన విష్ణుభరత్ యాదవ్, చాంగంటి శ్రీనివాస చౌదరి రూ.30 వేల నగదు బహుమతిని అందుకున్నారు. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం రోళ్లపాడు, గుంటూరు జిల్లా లింగాయపాలెంకు చెందిన ఎడ్లు 3006.4 అడుగులు లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు పేరెడ్డి మురళీ మోహన్‌రెడ్డి, యల్లం సాంబశివరావు రూ.25 వేలు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఎడ్లు 3004.4 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని మైలా త్రివేణి నాయుడు రూ.20 వేల నగదు బహుమతి అందుకున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన ఎడ్లు 3 వేల అడుగులు లాగి 6వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు బెల్లం రుతిక్ చౌదరి, యువాన్ చౌదరి రూ.15 వేలు, కడప జిల్లా చాపాడు మండలం పెద్దచీపాడు ఎడ్లు 2845 అడుగులు లాగి 7వ స్థానంలో నిలిచాయి. వాటి యజమాని బోగిరెడ్డి వీరాతేజా రెడ్డి రూ.10 వేలు, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అయోధ్యనగర్, పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామాలకు చెందిన ఎడ్లు 2764.2 అడుగులు లాగి 8వ స్థానంలో నిలిచాయి. వాటి యజమానులు రూ.8 వేలు, పల్నాడు జిల్లా దాచేపల్లి, సత్తెనపల్లి గ్రామాలకు చెందిన ఎడ్లు 2700 అడుగులు, తెలంగాణ రాష్ట్రం ఉప్పుగుంతల మండలం వేలటూరు గ్రామానికి చెందిన ఎడ్లు 2700 అడుగులు లాగి 9వ స్థానంలో నిలిచాయి. రెండు ప్రాంతాలకు చెందిన యజమానులు యామర్తి శేలేంద్ర యాదవ్, నక్కా బలరాంక్రిష్ణ, శివరామకృష్ణలకు రూ.6 వేల నగదు బహుమతి అందచేశారు. ఈ బహుమతులతోపాటు ఎమ్మెల్యే ఎడ్ల యజమానులకు శాలువాలు కప్పి షీల్డ్‌లు అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ జబీవుల్లా, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, నాయకులు టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల వీర కోటిరెడ్డి, జానకి రఘు, ఆవుల రమణారెడ్డి, షేక్.మహమ్మద్ కాశిం పాల్గొన్నారు.


