ఫిబ్రవరిలో హౌస్ బోట్లు ప్రారంభం
బాపట్ల: ఏపీటీడీసీ ఆధ్వర్యంలో సూర్యలంక బీచ్‌లో హౌస్ బోట్లను త్వరలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ చెప్పారు. బోట్లు ప్రారంభానికి ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం కలెక్టర్ పర్యాటక, పంచాయతీరాజ్, జలవనరులు, అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులతో కలసి సూర్యలంక ఆదర్శనగర్ వంతెన నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు మోటారైజ్డ్ బోటులో ప్రయాణించారు. పేరలి డ్రెయిన్, పొగరు, నిజాంపట్నం హార్బర్ వరకు పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పొగరు వద్ద పర్యాటకుల కోసం వాక్‌వే ఏర్పాటు చేయాలని, ఆదర్శనగర్ వద్ద జెట్టి నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదర్శనగర్ నుంచి నిజాంపట్నం వరకు కెనాల్ చుట్టూ బ్యూటిషన్ పెంపునకు చర్యలు తీసుకోవాలని, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని టూరిజం అధికారులకు సూచించారు. వన్ హెచ్‌బీ సామర్థ్యం కలిగిన బోట్లను ఫిబ్రవరిలో ఆరు బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోటు, రెండు బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోటు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నిజాంపట్నం హార్బర్‌లో సముద్రం నుంచి వేట ముగించుకుని వచ్చిన మత్స్యకారులతో మార్కెటింగ్ సౌకర్యం, చేపల వేటకు వెళ్లి సముద్రంలో ఎన్ని రోజులు ఉంటారు, అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే అంశాలపై చర్చించారు. కలెక్టర్ ప్రతిపాదిత ఆక్వా టూరిజం పార్క్‌ను వేగంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ విజయవాడ జనరల్ మేనేజర్ నాంచారయ్య, డీపీఓ ఎల్.ప్రభాకరరావు, జలవనరుల శాఖ ఈఈ ధనలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్, బాపట్ల తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో కలసి ఫీల్డ్ సర్వే చేసిన జిల్లా కలెక్టర్
ఫిబ్రవరిలో హౌస్ బోట్లు ప్రారంభం


