కారును తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు
ఇద్దరు యువకులు మృతి
మరో ఇద్దరికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
తిరుగు ప్రయాణంలో లాం వద్ద ఘటన
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
పరామర్శించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాలవజ్రబాబు
తాడికొండ: ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం లాం గ్రామం వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుళ్లూరు గ్రామానికి చెందిన యువకులు గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా లాం గ్రామ సమీపంలో వెటర్నరీ డాక్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చే సమయానికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి చింతచెట్టును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో ఉన్న కంతేటి తరుణ్(17), బాకి అఖిల్(18)లకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మేరుగ కిరణ్, పేరం ఇంద్రలకు గాయాలు కాగా జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పేరం ఇంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హుటాహుటిన జీజీహెచ్‌కు వెళ్లిన
బాల వజ్రబాబు
ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు హుటాహుటిన జీజీహెచ్‌కి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని క్షతగాత్రులను పరామర్శించారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇతర ఉన్నతాధికారులు, వైద్యులతో సంప్రదించి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి అంగా ఉంటానని హామీ ఇచ్చారు.
కారును తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు


