
స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన
బాపట్ల: బాపట్లలో భారత స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. భారీ వర్షాల కారణంతో ప్రజలకు అసౌకర్యాలు కలుగకుండా జెండా పండుగను నిర్వహించాలన్నారు. బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం సంబంధిత కళాశాల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. వర్షాలు వచ్చినప్పటికీ జాతీయ పండుగను వైభవంగా జరపాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతారన్నారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు, స్టాల్స్ ప్రదర్శన నిర్వహించే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. త్వరగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ఇన్‌చార్జి జేసీ జి.గంగాధర్‌గౌడ్, ఆర్డీవో గ్లోరియా ఉన్నారు.
ట్రయల్ రన్
బాపట్లటౌన్: గురువారం ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకలను వీక్షించడానికి విచ్చేసే ప్రజలకు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా తగిన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు వస్తుండటంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ జి.నారాయణ, పట్టణ సీఐ ఆర్.రాంబాబు, ఆర్‌ఐలు షేక్ మౌలుద్దీన్, టి.శ్రీకాంత్ పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన