
మరణంలోనూ ఒకరికొకరై..
వినుకొండ: పొట్టకూటికోసం వలస వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో రెండు జంటలు మృతిచెందిన ఘటన వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద జరిగింది. మృతుల్లో ఇద్దరు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని గడ్డమీదపల్లెవాసులుకాగా, మరో ఇద్దరు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండా వాసులుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. గడ్డమీదపల్లె గ్రామానికి చెందిన ఆరుగురు వ్యవసాయ కూలీలు బొప్పాయి పంట కోసేందుకు వాహనంలో తమ గ్రామం నుంచి పల్నాడుజిల్లా ఈపూరుకు బయలుదేరారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై మార్గమధ్యంలో వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కొబ్బరిబొండాల లారీ బొలేరోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో పగడాల రమణారెడ్డి(45), భార్య సుబ్బమ్మ(40), జొన్నగిరి రామాంజీ(35) భార్య అంకమ్మ(28)లు మృతి చెందారు. లారీలో ఉన్న మరోముగ్గురు కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, డ్రైవరు కదిరి నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డా రు. గాయపడిన వారు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పగడాల సుబ్బమ్మ, బొట్టు అంకమ్మలు ఘటనా స్థలంలోనే మృతి చెందగా పగడాల రమణారెడ్డి, బొట్టు రామాంజీలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. సమాచారం తెలుసుకున్న వినుకొండ పోలీసులు ఘటనాప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద వార్త తెలుసుకుని మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు వినుకొండ ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మృతుల బంధువుల రోదనతో ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
మిన్నంటిన రోదనలు
పగడాల రమణారెడ్డి, సుబ్బమ్మలకు ముగ్గురు సంతానం. మొదటి కుమార్తె అరుణ కుమారికి వివాహం కాగా రెండవ కుమారుడు రమణారెడ్డి బీటెక్ కంప్లీట్ చేశాడు. చివరి కుమార్తె నబిత ఇంటర్ పూర్తిచేసింది. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుమార్తెలు, కుమారుడు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కష్టపడుతూ తమకు కష్టం తెలీకుండా చూసుకునే తల్లిదండ్రులు ఇలా విగతజీవులుగా మారతారని తాము కలలోనూ ఊహించలేదంటూ రోదించారు.
● అలాగే మరో కుటుంబం బొట్టు రామాంజీ, అంకమ్మకి ఐదు, మూడు సంవత్సరాల కుమారులు ఉన్నారు. ఇంకా ఊహ కూడా తెలీకముందే పిల్లలు అనాథలుగా మారారని, ఇక వారికి దిక్కెవరంటూ బంధువులు పెద్ద పెట్టున రోదించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు మృతదేహాలను సందర్శించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వ్యవసాయ కూలీల వాహనాన్ని ఢీకొన్న లారీ ఘటనలో భార్యాభర్తలైన నలుగురు వ్యవసాయ కూలీలు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మృతుల్లో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసులు మరో ఇద్దరు వెల్దుర్తి మండలం దావుపల్లి తండావాసులుగా గుర్తింపు మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో వినుకొండ ప్రభుత్వాసుత్రిలో విషాద ఛాయలు