
డ్రెయిన్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలి
బాపట్ల: నీటిపారుదల, డ్రెయినేజీ శాఖల పరిధిలో నిర్వహించే ఆపరేషన్, నిర్వహణ పనులను తనిఖీ చేసే అధికారులకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో నీటిపారుదల, డ్రెయినేజీ శాఖలు నిర్వహించే మరమ్మతుల పనులను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మలు మంగళవారం తనిఖీ చేశారు. తొలుత జిల్లెలమూడి గ్రామంలోని నల్లమడ వాగులో కోతకు గురైన కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. నల్లమడ వాగులో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని, వాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నల్లమడ వాగు విస్తరణకు కావలసిన భూమి కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు. బాపట్ల జిల్లాకు నీటి సరఫరా చేసే పీటీ ఛానల్‌ను తనిఖీ చేశారు. ఛానల్‌లోని ఇసుక మేటలను తొలగించాలని తెలిపారు. బాపట్లకు చెందిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లోని పూడికలను తొలగించి, ట్యాంక్ విస్తీర్ణాన్ని పెంచి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. అందుకుగాను తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని నీటిపారుదల శాఖ ఎస్‌ఈని కలెక్టర్ ఆదేశించారు. నరసాయపాలెంలోని చెరుకూరు ట్యాంక్ చానల్‌లోని గుర్రపు డెక్క, తూటుకాడ తొలగింపు పనులను కలెక్టర్, బాపట్ల ఎమ్మెల్యే ప్రారంభించారు. నర్సాయపాలెం పంచాయతీలో చెత్త సేకరణ విషయమై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పంచాయతీ సెక్రెటరీ రాజును కలెక్టర్ ప్రశ్నించారు. సేకరించిన చెత్తను సమాధుల్లో పడవేయటానికి గల కారణా లపై పంచాయతీ సెక్రటరీని విచారించారు. పంచాయతీకి ఎస్‌డబ్ల్యూ పీసీ ల్యాండ్ కోసం జిల్లా రెవెన్యూ అధికారికి ప్రతిపాదన పంపాలని కలెక్టర్ పంచాయతీ సెక్రటరీకి సూచించారు. అనంతరం నల్లమడ వాగు లాకులను పరిశీలించారు. నల్లమడ వాగు లాకుల వివరాలను నీటిపారుల శాఖ ఎస్‌ఈని అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ వెంకటరత్నం, డ్రెయినేజీ శాఖ ఈఈ మురళీకృష్ణ, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల తహసీల్దార్ సలీమా, నీటిపారుదల, డ్రెయినేజీ శాఖలకు చెందిన డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను
నివారించాలి
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ నెల నుంచి ఇసుక తవ్వకాల నిషేధం అమలులోకి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రేవు నుంచి వాహనాలు వెళ్లే రహదారులను తొలగించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి