
బాపట్ల
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025
శిథిలావస్థలో సాగునీటి కాలువలు
కర్లపాలెం: వ్యవసాయ భూములకు సాగునీరు అందించే ప్రధాన కాలువలు శిథిలావస్థకు చేరాయి. మండల ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. వర్షాలు కురవక, సాగునీరు సక్రమంగా అందక సాగు అనుకూలంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కాలువలు శిథిలావస్థకు చేరటంతో ఖరీఫ్ సాగుకు నీరు అందుతాయా అని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. సాగునీటి పంట కాలువలను మరమ్మతులు చేసి సాగునీరు సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు.
మండలంలో 17వేల ఎకరాల సాగుభూమి.
కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 17వేల ఎకరాలు సాగుభూమి ఉంది. ఈ భూమిని ఆధారంగా చేసుకుని రైతులు, రైతు కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ భూములకు కాలువల ద్వారానే కృష్ణానది నుంచి నీరు వస్తుంది. సాగునీరు అందించేందుకు ప్రధానంగా పేరలి తిమ్మరాజు చానల్, ఆర్మండ చానల్‌లు ఉన్నాయి. పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో 13,500 ఎకరాలు, ఆర్మండ చానల్ పరిధిలో 3,500 ఎకరాలకు సాగునీరు వస్తుంది.
పంట కాలువల్లో నీరు పారేనా?
పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలోని తిమ్మరాజు చానల్, కర్లపాలెం చానల్, లంక చానల్, ఇసుక చానల్, పేరలి చానల్, తుమ్మలపల్లి చానల్, తుమ్మలశాఖ చానల్ పంట కాలువల సిమెంట్ లైనింగ్ శిథిలమై కాలువ కట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో సాగునీరు భూములకు సరిగా అందటం లేదు. ఆర్మండ్ చానల్ పరిధిలోని ఇసుక చానల్, పరకాలువ, యాజలి చానల్, బుద్ధాం చానల్ కాలువల కట్టలు శిథిలమవటంతోపాటు పూడిక పెరిగి సాగునీరు పారేందుకు అసౌకర్యంగా మారాయి. ఈ కాలువలను పూడిక తీయించటంతోపాటు, కట్టలను పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు.
శిథిలావస్థలో పేరలి తిమ్మరాజు చానల్
పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో మొత్తం 13,500 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ భూమికి పేరలి తిమ్మరాజు చానల్ పరిధిలో ఉన్న మరో ఏడు పంట కాలువలు ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరటంతో సాగునీరు సక్రమంగా అందే అవకాశం లేదు. తిమ్మరాజు చానల్ పరిధిలో 2700 ఎకరాలు, కర్లపాలెం చానల్ పరిధిలో 1100 ఎకరాలు, లంక చానల్ పరిధిలో 2వేల ఎకరాలు, ఇసుక చానల్ పరిధిలో 400 ఎకరాలు, పేరలి చానల్ పరిధిలో 1285 ఎకరాలు, తుమ్మలపల్లి చానల్ పరిధిలో 4800 ఎకరాలు, తుమ్మల శాఖ చానల్ పరిధిలో 1215 ఎకరాల భూమి సాగవుతుంది.
మరమ్మతులకు నోచని ఆర్మండ చానల్
ఆర్మండ చానల్ పరిధిలోని ఇసుక చానల్, పరకాలువ, యాజలి చానల్, బుద్ధాం చానల్ కాలువల పరిధిలో 3,500 ఎకరాల భూమి ఉంది. కాలువలకు ఈ వేసవి కాలంలో మరమ్మతులు చేయించాలని రైతాంగం కోరుతున్నారు.
న్యూస్‌రీల్
మరమ్మతులకు నోచుకోని పీటీ చానల్ 13,500 వేల ఎకరాల సాగు ఈ ఏడాది నీరు సక్రమంగా అందేనా!
మరమ్మతులు చేయాలి
పీటీ చానల్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలి. ఉపాధి హామీ పథకంలో కాలువలోని మట్టిని మాత్రమే తీస్తున్నారు. కాలువ గోడలన్నీ పగిలిపోయి గండ్లు పడుతున్నాయి. పంట చేలకు నీరు అందడం కష్టమే అవుతుంది.
–యల్లావుల ఏడుకొండలు, నర్రావారిపాలెం.
కాలువ చివరి భూములకు నీరందించాలి
పెదగొల్లపాలెం, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం, తుమ్మలపల్లి పంచాయతీల పరిధిలోని కాలువ చివరి భూములకు సాగునీరందించాలి. గత సంవత్సరం సాగునీరు రాక కొందరు రైతులు నాట్లు వేయలేదు. తిండి గింజలు పండించుకునేందుకు సాగునీరందించాలి.
– పందరబోయిన సుబ్బారావు,
రైతు నక్కలవానిపాలెం.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
కాలువలో తూటికాడ తొలగించి కాలువ కట్టలు పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంట కాలువల మరమ్మతులకు, గండ్లు పూడ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. –వెంకటరమణ, ఏఈ, ఇరిగేషన్

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల