
ఐసెట్‌లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్‌కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485 మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354 మంది విద్యార్థుల్లో 338 మంది ఉత్తీర్ణత సాధించారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు.
కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు
ఐసెట్‌లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. మాధుర్య 2022లో కాకినాడ జేఎన్‌టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసి, కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు