దైవ సన్నిధి నుంచి తిరిగి వస్తూ.. | - | Sakshi
Sakshi News home page

దైవ సన్నిధి నుంచి తిరిగి వస్తూ..

May 21 2025 1:41 AM | Updated on May 21 2025 1:41 AM

దైవ స

దైవ సన్నిధి నుంచి తిరిగి వస్తూ..

ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

మేదరమెట్ల: కారులో తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణమైన అనంతరం కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇరువురికి గాయాలయ్యాయి. కొరిశపాడు మండలం మేదరమెట్ల ఉత్తర బైపాస్‌ ప్రాంతంలో మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తిరుపతి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మేదరమెట్ల ఉత్తర బైపాస్‌ సమీపానికి రాగానే అతివేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుంకర నాగరాజు (21) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని వైద్యశాలకు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల ఎస్‌ఐ మహ్మద్‌ రఫీ తెలిపారు.

వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. జూన్‌ 2వ తేదీ లోపు వ్యవసాయ శాఖలోని అన్ని విభాగాల్లో బదిలీలు పూర్తి చేయాలని తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. మిగిలిన వారు కూడా రిక్వస్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ కింద బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.మండల వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులు(ఏఓ), ఏడీఏ, డీడీఏ, మినిస్టీరియల్‌ స్టాఫ్‌, వాచ్‌మెన్‌, అటెండర్స్‌ తదితర అన్ని విభాగాల్లోనూ బదిలీల ప్రక్రియ ఉండటంతో ఎవరికి వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సిఫారసుల కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాలకు ఉద్యోగుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో డబ్బు ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదని చెబుతున్నారు. ఇదే అదునుగా ఆ శాఖ ఉన్నతాధికారులు, అసోసియేషన్‌ నాయకులు, అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతలు అంతో ఇంతో వెనుకేసుకునేందుకు ఉద్యోగులకు వల విసురుతున్నట్లు సమాచారం.

శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం

తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహుతి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.

మహంకాళీ దేవస్థానంలో చండీ హోమం

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళవారం చండీ హోమం నిర్వహించారు. పోసాని నాగేశ్వరరావు దంపతులు హోమంలో పాల్గొన్నారు. భక్తులకు అమ్మవారు ధనలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

దైవ సన్నిధి నుంచి  తిరిగి వస్తూ.. 1
1/1

దైవ సన్నిధి నుంచి తిరిగి వస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement