
యోగాంధ్రలో ప్రజలంతా పాల్గొనేలా చూడాలి
అధికారులను ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే యోగాపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖపట్నంలో పాల్గొనే కార్యక్రమం లైవ్ ద్వారా ప్రసారం జరుగుతుందని, ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. యోగాపై ప్రజలల్లో చైతన్యం కలిగించి, ప్రతి ఒక్కరూ యోగాభ్యసనంలో పాల్గొనేలా చేయాలన్నారు. ముందుగా మండలానికి ఇద్దరేసి యోగా శిక్షకులను గుర్తించి వారి ద్వారా టీఓటీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారి ద్వారా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. టీఓటీ కోసం ప్రతి గ్రామం, వార్డ్ నుంచి ఒకరి చొప్పున ఎంపిక చేసి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వారి వివరాలను పంపాలని తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వరకు టీఓటీ శిక్షణ ఉంటుందన్నారు.
జూన్ 16 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు..
మాస్టర్ ట్రైనర్లకు ఐదు రోజులు, యోగా నేర్చుకునే వారికీ మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. వీరందరికీ యోగా పూర్తిచేసినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరూ తప్పక యోగాభ్యాసన చేయాలనీ తెలిపారు. జూన్ 16న ఫ్యామిలీ యోగా పేరుతో నాలుగు తరాల కుటుంబ సభ్యులంతా పాల్గొనేలా చూడాలని, 17న సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ యోగా కార్యక్రమాలు ఉంటాయని, 18, 19 తేదీలలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఈ కార్యక్రమాలను ఆయా స్థాయిలలో నిర్వహిస్తారని తెలిపారు. మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. ఈ నెల 21న నాలుగు గంటలకు కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
అంతర్జాతీయ ఎగుమతిదారుల సమావేశం
కొరిటెపాడు(గుంటూరు): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం ఎగుమతిదారుల సమావేశం జరిగింది. సమావేశానికి ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి.ప్రభు అధ్యక్షత వహించారు. ఎగుమతిదారులకు బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల రుణాలు, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల పద్ధతులు, అంతర్జాతీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఎస్‌బీఐ ఏజీఎంలు రామ్‌ప్రసాద్, రమేష్‌బాబు, విజయ రాఘవయ్య, సూర్యశేఖర్, మేనేజర్ శ్రీను నాయక్, ఈసీజీసీ అధికారులు, పలువురు ఎగుమతిదారులు పాల్గొన్నారు.