మన్యం మిరియాలు అ‘ధర’హో..!

Special article with district collector on pepper cultivation at Alluri district in AP - Sakshi

తొలిసారిగా ఐటీడీఏ కొనుగోలు

కిలో రూ.500 మద్దతు ధర ప్రకటన

జిల్లాలో 50 వేల ఎకరాల్లో మిరియాల సాగు

5 వేల మెట్రిక్‌ టన్నుల ఎండు మిరియాల దిగుబడి

దీనిపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెర్షన్‌ కథనం

సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజన రైతుల నుంచి 100 మెట్రిక్‌ టన్నుల మిరియాలను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. పాడేరు డివిజన్‌లోని వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలం నుంచి 10 టన్నులు కొనుగోలు చేయాలని తెలిపారు.

మిరియాల పంటను సాగుచేస్తున్న గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కిలో రూ.500 మద్దతు ధరతో నాణ్యమైన మిరియాలను కొనుగోలు చేస్తామన్నారు. తక్కువ ధరతో దళారీలకు అమ్ముకుని మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిరియాల ఉత్పత్తిలో గిరిజన రైతులు తగిన నాణ్యత పాటించాలని, ఎండిన మిరియాలలో తేమశాతం తక్కువుగా ఉండాలన్నారు.

వచ్చేనెల 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు కాఫీ లైజన్‌ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి మిరియాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాల నిల్వలకు గాను గిరిజన రైతులకు ఉచితంగా గోనెసంచులను పంపిణీ చేస్తామన్నారు.10వేల ఎకరాల్లో కాఫీ తోటల కన్సాలిడేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

మిరియాల నూర్పిడికి యంత్రాల వినియోగం
స్పైసెస్‌ బోర్డు విస్తరణ అధికారి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు పాదుల నుంచి సేకరించిన మిరియాల నూర్పిడిలో యంత్రపరికరాలను వినియోగించాలన్నారు. కంకుల నుంచి మిరియాలను వేరుచేసేందుకు కాళ్లతో తొక్కడం వల్ల బ్యాక్టిరీయా చేరి నాణ్యత తగ్గే పరిస్థితి ఉందన్నారు.

పచ్చిమిరియాలను ఒక నిమిషం వేడినీటిలో ముంచి తీసిన తరువాత ఎండబెడితే గింజ నల్లగా ఉండి మంచి ధర వస్తుందని చెప్పారు. తేమ 10 శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్‌, కేంద్ర కాఫీబోర్డు డీడీ రమేష్‌,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు, రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top