టమాటా ధరలు ఢమాల్‌ | - | Sakshi
Sakshi News home page

టమాటా ధరలు ఢమాల్‌

Jun 25 2026 4:53 AM | Updated on Jun 25 2026 4:53 AM

వారంరోజులుగా తగ్గిపోతున్న ధరలు

మార్కెట్లో కిలో టమాటా రూ.11

15రోజుల కిందట ధరతో పోల్చితే 75 శాతం కోత

జిల్లాలో పెరిగిన పంట దిగుబడులు

బయటి రాష్ట్రాల్లో దిగుబడితో తగ్గుతున్న ధరలు

ఆవేదనలో టమాటా రైతులు

గుర్రంకొండ : టమాటా ధరలు ఒక్కసారిగా ఢమాల్‌ అంటూ పడిపోయాయి. వారం రోజులుగా టమాటా ధరలు మార్కెట్లో రోజు రోజుకు పతనమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర రూ. రూ.11కు పడిపోయింది. 15 రోజుల కిందట మార్కెట్లో ధరలతో పోల్చితే 75 శాతం ధరల్లో కోత పడింది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.

34వేల ఎకరాల్లో ప్రస్తుత పంట దిగుబడి

జిల్లా పరిధిలో ప్రస్తుతం 34వేల ఎకరాల్లో టమాటా దిగుబడి వస్తోంది. ప్రతి ఏడాది ఈసీజన్‌లో 34 వేల నుంచి 40వేల ఎకరాల్లో టమాటా పంట దిగుబడి వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా తోటలు బాగా పుంజుకొన్నాయి. దీంతో టమాటా పంట దిగుబడి ప్రస్తుతం అధికంగా వస్తోంది. పదిహేనురోజుల కిందట జిల్లాలో వచ్చిన టమాటా దిగుబడులతో పోల్చితే ప్రస్తుతం 65 శాతం పెరిగింది. ఇదేనెలలో పదిహేను రోజులకిందట జిల్లా వ్యాప్తంగా 12 వేల ఎకరాల్లో మాత్రమే పంట దిగుబడి వచ్చింది. ప్రస్తుతం వాతావారణంలో సంభవించిన మార్పులు, ఆడపాదడపా కురిసిన వర్షాలతో టమాటా తోటల్లో పంట దిగుబడులు రోజు రోజుకు పెరుగుతుండడం గమనార్హం.

మార్కెట్లో పతనమవుతున్న ధరలు

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న టమాటా మార్కెట్లలో రోజు రోజుకు ధరలు పతనమవుతున్నాయి. 15 రోజులు కిందట 25 కేజీల టమాటా క్రీట్‌ ధరలు అత్యధికంగా రూ.1000 నుంచి రూ.1100వరకు ధరలు పలికాయి. అయితే ప్రస్తుతం ఒక క్రీట్‌ ధర రూ. 250 నుంచి రూ. 300 లోపే పలుకుతున్నాయి. వారం రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు రోజురోజుకు తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవే ధరలు నిలకడగా ఉంటే కనీసం పంట సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

వాతావరణ మార్పులతో దిగుబడులు అధికం

ఇటీవల కురుస్తున్న వర్షాలకు, మారిన వాతావరణం కారణంగా జిల్లాలో టమాటా తోటల్లో పంట దిగుబడులు పుష్కలంగా వస్తున్నాయి. పదిహేను రోజుల కిందట జిల్లాలో ప్రతిరోజు 2500 నుంచి 3 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పంట దిగుబడులు పెరగడంతో 10వేల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి మార్కెట్లకు వస్తుండడం గమనార్హం. ప్రస్తుతం దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ధరలు రోజురోజుకు తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బయట రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాలో దిగుబడి ఎక్కువ

బయట రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాలో టమాటా దిగుబడి నిలకడగా వస్తుండడంతో ఇక్కడి టమాటా ధరలు పెరగడం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తోపాటు రాయలసీమ జిల్లాలైన అనంతరపుం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ జిల్లాలో టమాటా దిగుబడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో బయట రాష్ట్రాల వ్యాపారులు మన జిల్లాకు రావడం లేదు. దీంతో ఇక్కడి టమాటాలు బయట రాష్ట్రాలకు ఎగుమతి చేయక పోవడంతో ధరలు తుగ్గుముఖం పట్టాయి. స్థానిక వ్యాపారులే టమాటాలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ధరలు పాతాళానికి పడిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నాయి.

ప్రభుత్వం వైపు టమాటా రైతుల చూపు

మార్కెట్లో టమాటా ధరలు అత్యధికంగా పలుకుతున్నప్పుడు ధరలు తగ్గించి విక్రయించాలని మార్కెట్‌ అధికారులను ఆదేశించే ప్రభుత్వం నేడు తమను ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు. 25 కేజీల టమాటా క్రీట్‌ ధర గతంలో రూ. 2500 ఉన్నప్పుడు ప్రభుత్వం మార్కెట్లో ధరలు తగ్గించి రూ.1000కే ప్రజలకు అందించిన దాఖలాలు ఉన్నాయి. అదే విధంగా నేడు ధరలు తగ్గుముఖం పడుతున్నందున ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించి టమాటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కనీసం ఒక టమాటా క్రీట్‌ ధర రూ. 1000 కి ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు అంటున్నారు.

మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేవు

మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వారంరోజులుగా ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. బయట రాష్ట్రాల్లో తో పాటు మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టమాటా దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో బయటరాష్ట్రాల వ్యాపారులు జిల్లాకు రాకపోవడంతో టమాటా ధరలు ఆశించినంతగా పెరగడం లేదు. ధరలు తగ్గిపోతుండడంతో నష్టపోతున్నాం. – పూజారి రెడ్డెప్ప, టమాటా రైతు, దౌలత్‌ఖాన్‌పల్లె

ప్రభుత్వమే టమాటాలు కొనుగోలు చేయాలి..

మార్కెట్లో టమాటా ధరలు తగ్గిపోతుండడంతో ప్రభుత్వమే చొరవచూపి రైతులు పండించిన టమాటాలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి. టమాటా ధరలు అత్యధికంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ప్రభుత్వం తగ్గించి కొనుగోలు చేసి ప్రజలకు అందించింది. ఇప్పుడు ధరలు తగ్గిపోయినందున ప్రభుత్వం గతంలో మా వద్ద కొనుగోలు చేసిన క్రీట్‌ ధర రూ.1000కు ఇప్పుడు తీసుకొని రైతులును ఆదుకోవాలి.

– వెంకటరమణ, టమాటా రైతు, మొరంపల్లె

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement