ఆటో బోల్తా – ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా – ఇద్దరికి గాయాలు

Jun 25 2026 4:53 AM | Updated on Jun 25 2026 4:53 AM

మదనపల్లె టౌన్‌ : ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని చంద్ర కాలనీకి చెందిన కె.చందు (20), కృష్ణ (20) మంచి స్నేహితులు. వీరిద్దరూ రోజూ ఆటోలో పల్లెలకు వెళ్లి గుజిరి సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గుజిరి సేకరణ కోసం పల్లెలకు ఆటోలో వెళుతుండగా, మదనపల్లె – పుంగనూరు రోడ్డు, 150వ మైలు రాయి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి, రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డ చందును మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. మరో యువకుడు కృష్ణ జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీ

మదనపల్లె టౌన్‌ : గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌ రైడర్‌ పరిస్థితి విషమించిన సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లి, చౌడేశ్వరి నగర్‌కు చెందిన మగ్గాల యజమాని దామోదర్‌ రెడ్డి(50) బైక్‌పై చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా, మదనపల్లె మండలం కొండామరిపల్లి పంచాయతీ, ముంబై–చైన్నె జాతీయ రహదారిపై వెన్నెల రెస్టారెంట్‌ మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ దామోదర్‌ రెడ్డిని 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం కోసం గాలిస్తున్నారు.

అల్లనేరేడు చెట్టుపై నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు

మదనపల్లె టౌన్‌ : అల్లనేరేడు కాయలు కోసేందుకు చెట్టు ఎక్కిన కూలీ కొమ్మ విరిగి కిందపడి తీవ్రంగా గాయపడ్డ ఘటన బుధవారం బి.కొత్తకోట మండలంలో జరిగింది.బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.కొత్తకోటకు చెందిన నరేష్‌(39) ఊరికి సమీపంలోని ఓ వ్యక్తి తోటలో అల్లనేరేడు కాయలు కోసేందుకు కూలి పనులకు వెళ్లాడు. సహచరులతో కలిసి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కొమ్మ విరిగిపోయింది. కింద పడి తీవ్రంగా గాయపడిన నరేష్‌ను స్థానికులు వెంటనే గుర్తించి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు వెంటనే బాధితున్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement