మదనపల్లె టౌన్ : కారు బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ వెల్లడించిన వివరాలు.. మండలంలోని అంకిశెట్టిపల్లికి చెందిన కొప్పల కిషోర్ కుమార్ అలియాస్ చంటి ఈ నెల 17న తన స్వగ్రామంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి, తిరుపతి నుంచి వస్తున్న బంధువులను ఆర్టీసీ బస్టాండ్ వద్ద కారులో ఎక్కించుకుని అంకిశెట్టిపల్లికి బయలుదేరాడు.మార్గమధ్యంలో అంకిశెట్టిపల్లి రోడ్డులోని సమాధుల తోట వద్ద మలుపులో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురూ తీవ్రంగా గాయపడ్డారు. అందులో కిషోర్ కుమార్ కోమాలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి కిషోర్ కుమార్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి కిషోర్ కుమార్ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం అంకిశెట్టిపల్లికి తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ముగ్గురికి తీవ్ర గాయాలు
చౌడేపల్లె : బైక్‌ను బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం బోయకొండ మార్గంలోని మేకలవారిపల్లె వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం రాయలపేట సమీపంలోని గమ్‌కొండ కు చెందిన రవి, సుబ్రమణ్యం, గురునాథ్‌లు బైక్‌లో బోయకొండ వద్ద టమోటా తోటలో కూలి పనుల కోసం వెళ్తున్నారు. మేకలవారిపల్లె వద్ద ఒక్కసారిగా పంట పొలాల్లో నుంచి రోడ్డుపైకి బొలెరో రావడంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. గాయపడిన వారిని స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యసేవల కోసం మదనపల్లెకు తీసుకెళ్లారు.
ఆటో డ్రైవర్‌కు..
కురబలకోట : కారు ఢీకొని ఆటో బోల్తా పడి డ్రైవర్ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు పోలీసులు వివరాలు వెల్లడించారు. మండలంలోని సింగన్న గారిపల్లెకు చెందిన ఆంజనేయులు(55) సొంతంగా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే అంగళ్లు నుంచి ప్రయాణికులను ఆటోలో దొమ్మన్నబావికి తరలించాడు. ప్రయాణికులను దించి తిరిగి అంగళ్లుకు బయలుదేరాడు. దొమ్మన్నబావి బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులును 108 సిబ్బంది వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.


