మదనపల్లె టౌన్ : అదనపు కట్నం కోసం కోడల్ని వేధించిన ఆరోపణలపై అత్త, ఆమె భర్త పై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండలంలోని కోళ్ల బైలు కాలనీకి చెందిన ఇంద్రజ ను ఆమె భర్త పవన్ కుమార్, అత్త శంకరమ్మ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో కేసు నమోదైందని తెలిపారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఇంద్రజకు, పవన్ కుమార్‌కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. తదుపరి కాండ్లమడుగు క్రాస్ వద్ద కలిసి జీవిస్తున్నారు. భర్త పవన్ కుమార్ మద్యానికి అలవాటు పడి, అదనపు కట్నం కోసం ఇంద్రజను వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి తాలూకా పోలీస్ స్టేషన్‌న్‌లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గాజులవారిపల్లె పాఠశాలపై నివేదిక ఇస్తాం
చౌడేపల్లె : మండలంలోని వెంగళపల్లె పంచాయతీ గాజులవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3, 4, 5 తరగతులను మర్రిమాకులపల్లె పాఠశాలకు విలీనం పై గత రెండు రోజులుగా సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విధితమే. స్పందించిన ఎంఈఓ బుధవారం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తాము ఎస్‌ఎంసీ కమిటీ తీర్మాణం మేరకు విలీనంపై చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆగ్రామంతోపాటు మోట్లపల్లె, నరసాపురం, యానాధిపాళ్యం నుంచి మర్రిమాకులపల్లె పాఠశాలకు విద్యార్థులు బడికి వెళ్లడానికి పడుతున్న అవస్థలు, దూరం 5 కిలోమీటర్లు ఉందని తల్లిదండ్రులు అధికారులకు వినతిచేశారన్నారు. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనర్ చెంతకు తీసుకెళ్లేలా ఉన్నతాధికారులకు సమస్యను వివరించి ఆ గ్రామంలోనే ఆ తరగతులు కొనసాగించేలా చూస్తామని వివరించారు.
ఉద్యమ్ సర్టిఫికెట్‌తో ప్రయోజనాలు
సదుం : పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసే ఉద్యమ్ సర్టిఫికెట్‌తో మహిళలు నిర్వహించే వ్యాపారాలకు గుర్తింపు లభిస్తుందని జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక అధికారి నాగార్జున తెలిపారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్లపై మహిళా సంఘ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సర్టిఫికెట్ పొందితే తక్కువ వడ్డీకే రుణాలు, ప్రభుత్వ రాయితీలు లభిస్తాయన్నారు. మహిళలు దీనిని సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.


