విద్యార్థిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై హత్యాయత్నం

Jun 25 2026 4:53 AM | Updated on Jun 25 2026 4:53 AM

8 కుట్లు పడిన వైనం

మండిపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు

వాల్మీకిపురం : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య మంగళవారం పుస్తకాల గొడవ జరిగింది. మండలంలోని గొల్లపల్లికి చెందిన విద్యార్థి హర్షవర్థన్‌ పుస్తకాలను పట్టణానికి చెందిన విద్యార్థి భరత్‌ రాజ్‌ దొంగలించాడు. దొంగలించిన విషయం తెలుసుకుని.. ఇలా పుస్తకాలను దొంగలించడం తప్పు కదా అంటూ భరత్‌రాజ్‌ను నిలదీశాడు. వీరి మధ్య వాగ్వాదం జరిగి ఎవరి ఇంటికి వాళ్లు మంగళవారం సాయంత్రం వెళ్లిపోయారు. బుధవారం ఉదయం భరత్‌రాజ్‌ తన వెంట తెచ్చుకున్న నగదుతో రూ.5 వెచ్చించి చిన్నపాటి చాకును కొనుగోలు చేసి దాన్ని జోబులో పెట్టుకొని పాఠశాలకు వచ్చాడు. వచ్చి తోటి విద్యార్థులతో మాట్లాడుతూ.. హర్షవర్థన్‌ రానివ్వండి వాడి కథ చూస్తా ఈ రోజు అంటూ.. హెచ్చరికలు జారీ చేశాడు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. పొరుగున ఉన్న గొల్లపల్లి నుంచి హర్షవర్థన్‌ తరగతి గదిలోకి వచ్చి పుస్తకాలను కింద పెట్టేందుకు ఒంగాడు. ఈలోపే భరత్‌రాజ్‌ తన వెంట తెచ్చుకున్న చిన్నపాటి చాకుతో హర్షవర్థన్‌ మెడపై బలంగా కోశాడు. దీంతో హర్షవర్థన్‌కు తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గాయపడిన విద్యార్థిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి మెడపై దాదాపు 8 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement